ఆరోగ్యాన్ని ప్రసాదించే అరుదైన తీర్థం !
జీవితంలో ఆనందమనేది ఆరోగ్యంతోనే ముడిపడి వుంటుంది. ఆరోగ్యం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కనుక నలుగురిలోకి వెళ్లి వాళ్లతో ఆనందంగా గడపగలుగుతుంటారు. ఇక అనారోగ్యంతో వున్నవాళ్లు మానసికంగా ఒంటరితనాన్ని అనుభవిస్తూ, ఆ పరిస్థితి నుంచి బయటపడే క్షణం కోసం ఎదురుచూస్తూ వుంటారు.
వివిధ రకాల ఔషధాలు వాడుతూ కూడా ఆ భగవంతుడిపైన భారం వేస్తూ వుంటారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నవాళ్లు పుణ్యక్షేత్రాలను దర్శిస్తుంటారు ... అక్కడి దివ్య తీర్థాలను సేవిస్తుంటారు. అలాంటి దివ్యతీర్థాలు గల క్షేత్రాలలో ఒకటిగా 'శ్రీక్షేత్ర బనేశ్వర్' కనిపిస్తుంది. మహారాష్ట్ర - పూణె సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది.
ఆదిదేవుడు ఆవిర్భవించిన ఈ క్షేత్రంతో పాటు ఇక్కడి కుండాలు మహిమాన్వితమైనవిగా చెబుతుంటారు. సాధారణంగా పుణ్య క్షేత్రాల్లో గల దివ్యతీర్థాలు రెండు రకాలుగా కనిపిస్తూ వుంటాయి. కొన్ని తీర్థాలలోని నీరు అక్కడి దైవానికి సంబంధించిన సేవలకు మాత్రమే వాడుతుంటారు. మరి కొన్ని తీర్థాలలో భక్తులకు స్నానం చేసే అవకాశాన్ని కల్పిస్తారు.
ఈ తీర్థాలలో స్నానం చేయడం వలన అనేక పాపాలు ... దోషాలు నశిస్తాయని చెబుతుంటారు. ఇక శ్రీక్షేత్ర బనేశ్వర్ విషయానికి వచ్చేసరికి ఇక్కడి తీర్థాలను 'కుండాలు' అని పిలుస్తుంటారు. ఈ కుండాలులో నీరు అదే పనిగా ఊరుతూ ఉంటుందట. వివిధ అనారోగ్యలతోను ... దీర్ఘకాలిక వ్యాధులతోను బాధపడుతోన్న వాళ్లు ఈ కుండాలలోని తీర్థాన్ని సేవిస్తుంటారు.
మండలం పాటు ఈ తీర్థాన్ని సేవించినట్టయితే ఆయా వ్యాధులు నివారించబడతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. అనుభవ పూర్వకంగా ఈ తీర్థం యొక్క మహిమను తెలుసుకున్న వాళ్లు స్వామి దర్శనం చేసుకుని కృతజ్ఞతా పూర్వకంగా కానుకలు సమర్పించి వెళుతుంటారు.