సుఖసంతోషాలను ప్రసాదించే అభిషేకం
జీవితం కష్టసుఖాల కలయికగా కొనసాగుతూ వుంటుంది. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా జీవితం సుఖంగా సాగిపోతున్నప్పుడు భగవంతుడిని గుర్తుపెట్టుకుని అనుదినం అంకితభావంతో పూజించినప్పుడు, కష్టకాలంలో ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఏ పూజ చేసినా ... ఏ పుణ్యక్షేత్రాన్ని దర్శించినా అందరూ కోరుకునేది తమని చల్లగా చూడమనే. దానం చేసినా ... ధర్మ మార్గాన్ని అనుసరించినా అది తమని రక్షిస్తూ ఉంటుందనే.
నిజానికి పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఫలితాలుగానే కష్టాలు ... సుఖాలు వచ్చివెళుతూ ఉంటాయి. అలాంటి కష్టాలను తట్టుకోవడం ... బాధలను భరించడం అంత తేలిక కాదు. వాటి నుంచి ఎప్పుడు బయటపడతామా అన్నంతగా ఆ పరిస్థితులు వుంటాయి. అందువలన అలాంటి కష్టాలు రాకుండా చూడమని ముందుగానే కొందరు భగవంతుడిని ప్రార్ధిస్తూ వుంటారు. మరికొందరు సమస్యల మధ్య చిక్కుకుని వాటి బారి నుంచి బయటపడేయమని భగవంతుడిని కోరుతుంటారు.
ఇలా ఇబ్బందులుపడే వాళ్లంతా ఖర్జూర జలాలతో శివుడిని అభిషేకించడం వలన ఆశించిన ఫలితం దక్కుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. పరమ దయా సముద్రుడు అయినటువంటి పరమశివుడిని ఒక్కో అభిషేక ద్రవ్యంతో అభిషేకించడం వలన ఒక్కో పుణ్యఫలం లభిస్తుందని చెప్పబడుతోంది. ఈ నేపథ్యంలో ఖర్జూర జలాల ప్రస్తావన కూడా కనిపిస్తుంది. ఖర్జూర జలలాతో శివుడిని అభిషేకించడం వలన పూర్వజన్మ పాపాల ఫలితంగా అనుభవిస్తోన్న కష్టాలు తొలగిపోయి, సుఖవంతమైన జీవితం లభిస్తుందని స్పష్టం చేయబడుతోంది.