పతిసేవా భాగ్యానికి మించినది లేదు
ఒక రోజున నలమహారాజు దాయాదితో జూదం ఆడుతున్నాడని తెలిసిన దమయంతి ఆశ్చర్యపోతుంది. తన రాజ్యంలో ఎవరూ జూదం ఆడకూడదని నిషేధం విధించిన భర్త జూదం ఆడుతున్నాడని తెలిసి ఆమె ఆందోళన చెందుతుంది. హఠాత్తుగా ఆయన అలా తన నిర్ణయాన్ని మార్చుకోవడం వెనుక ఏదో కారణం వుండి ఉంటుందని ఆమె మనసు కీడు శంకిస్తుంది. వెంటనే తన విశ్రాంతి మందిరం నుంచి బయలుదేరి భర్త జూదం ఆడుతోన్న మందిరానికి వెళుతుంది.
సరదాగా మొదలైన జూదం పందాల వరకూ వెళ్లడంతో అప్పటికే నలమహారాజు తన రాజ్యంలోని కొన్ని భాగాలను కోల్పోతాడు. జూదం ఆడటం వలన చెడే తప్ప మంచి జరిగిన దాఖలాలు చరిత్రలో ఎక్కడా లేవని నలమహారాజుతో దమయంతి చెబుతుంది. సిరిసంపదలను తుడిచి పెట్టడమే కాకుండా, పరువు ప్రతిష్ఠలను వీధిన పడేసే శక్తి జూదానికి వుందని అంటుంది.
కుటుంబ సభ్యులు ... దేశ ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వెంటనే జూదాన్ని ఆపమని దమయంతి కోరుతుంది. అయినా ఆమె మాటలు వినకుండా నలమహారాజు జూదం ఆడతాడు .. పందెంగా రాజ్యాన్ని కోల్పోతాడు. ఓడినవారు రాజ్యాన్ని విడిచి వెళ్లాలనే నియమం కూడా ఉండటంతో కట్టుబట్టలతో అక్కడి నుంచి కదులుతాడు. విధి కారణంగా ఓడిన భర్తను నిందిచడం వలన ఆయన మనసు మరింత గాయపడుతుందని దమయంతి భర్తను ఒక్కమాట కూడా అనదు.
అమ్మవారిపై భారంవేసి భర్తతో పాటు కష్టాలను అనుభవించడానికి ఆమె సిద్ధపడుతుంది. అడవిలోనైనా ఆయన సేవ చేసుకునే భాగ్యం దొరికితే తనకదే చాలని అనుకుంటుంది. ఆయన సేవ చేసుకోవడంలోనే తనకి నిజమైన ఆనందం కలుగుతుందని భావిస్తుంది. ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా తన పిల్లలను పుట్టింటికి పంపించి వేసి ఆనందంగా భర్తను అనుసరిస్తుంది.