కృష్ణా అంటే కష్టములు వుండవు

కృష్ణా అని ఒక్కసారి పిలిచినంతనే కష్టాలు తొలగిపోతాయి. తనని విశ్వసించిన వాళ్లు ... తనపై ఆధారపడిన వాళ్లు ఎలాంటి కష్టాల్లో వున్నా ఆయన వచ్చి ఆదుకున్న తీరును వింటే ఎవరికైనా వళ్లు పులకరించిపోతుంది. మిత్రుడైన సుధాముడు గుప్పెడు అటుకులను అభిమానంతో ఇస్తే, వాటిని ఆనందంగా స్వీకరించి సమస్త సిరిసంపదలను అనుగ్రహించాడు.

తన శత్రువుల కారణంగా అమాయకులైన ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అందుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకున్నాడు. గోవును ఎంత అపురూపంగా చూసుకోవాలో ... దాని ఫలితం ఎలా వుంటుందో చాటిచెప్పాడు. అడుగడుగునా అధర్మాన్ని అణచివేస్తూ ధర్మ ప్రతిష్ఠాపన చేసుకుంటూ వెళ్లాడు. ధర్మాన్ని బ్రతికించడం కోసం ... ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఆయన చేసిన లీలలు గురించి వింటే చాలు ... జన్మ ధన్యమైపోతుంది.

అలాంటి కృష్ణుడు జన్మించిన 'శ్రావణ బహుళ అష్టమి' .. కృష్ణాష్టమిగా చెప్పబడుతోంది. రోహిణి నక్షత్రంతో కూడిన అష్టమి రోజున బాలకృష్ణుడిని అంకితభావంతో ఆరాధిస్తూ వుంటారు. దేవతలు ... మహర్షులు ... మహాభక్తులు ఎందరో ఆ స్వామిని సేవించి తరించారు. అలాంటి అవతార పురుషుడు జన్మించిన ఈ రోజున ఉదయాన్నే నదీ స్నానం చేసి ... ఉపవాస దీక్షను చేపట్టి జాగరణకు సిద్ధపడి 'జన్మాష్టమీ వ్రతం' అచరించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

ఈ రోజున ఉదయం వేళలో మాత్రమే కాదు ... రాత్రి వేళలోను స్వామిని ఆరాధిస్తూ పాలు .. పెరుగు .. వెన్న .. మీగడ .. అటుకులు .. వడపప్పు .. బెల్లం నైవేద్యంగా సమర్పించాలి.బంగారం ... వెండి .. ఇత్తడి .. రాగి .. కొయ్య .. మట్టితో చేయబడిన కృష్ణుడి ప్రతిమలు పూజకు అర్హమైనవిగా పేర్కొనబడుతున్నాయి. ఈ రోజున జన్మాష్టమీ వ్రతాన్ని ఆచరించడం వలన మనోభీష్టాలు నెరవేరి సకల శుభాలు కలుగుతాయని చెప్పబడుతోంది.


More Bhakti News