శ్రీకృష్ణ నామామృతం అంత గొప్పది !
అంధుడైన సూరదాస్ నిరంతరం శ్రీకృష్ణుడిని స్మరిస్తూ ఉండేవాడు. ఆయన తన మనోనేత్రం ద్వారా ఆ అవతార పురుషుడి రూపాన్ని దర్శిస్తూ పరవశిస్తూ పాడేవాడు. ఆయన గానానికి ప్రజలు మంత్రముగ్ధులై అలా కూర్చుండిపోయే వాళ్లు. శ్రీకృష్ణుడి లీలా విశేషాలను గురించి చెబుతూ ఆయన కూడా ఆకలిదప్పుల గురించి మరిచిపోయేవాడు.
అందువల్లనే సాక్షాత్తు కృష్ణుడే గోపాలుడి వేషధారణలో ఆయన దగ్గరే ఉంటూ కావలసిన సాయంచేస్తూ వుంటాడు. ఆ పరమాత్ముడే స్వయంగా దిగివచ్చి తనకి సేవలు చేస్తున్నాడని తెలియని సూరదాస్, కృష్ణుడి బాల్యక్రీడల్లోని కొన్ని ఘట్టాలను గురించి ఆయనకే చెబుతూ పొంగిపోయేవాడు. ఏమీ ఎరుగనివాడిలా ఆసక్తిగా వింటూ కృష్ణుడు మురిసిపోయేవాడు.
అలాంటి పరిస్థితుల్లో ఒక రోజున ఆ గ్రామంలో గల ఆలయంలో కృష్ణుడికి సమర్పించిన నైవేద్యం మాయమవుతుంది. ఏం జరిగిందో ... ఎలా జరిగిందో తెలియక అర్చకులతో సహా అంతా అయోమయానికి లోనవుతారు. ఆ విషయాన్ని గురించి మాట్లాడుకుంటూ వాళ్లు సూరదాస్ నివసిస్తోన్న ఇంటివైపుగా వస్తారు. తన కోసం కృష్ణుడే పాయసాన్ని తెచ్చి తినమంటూ వత్తిడి చేస్తుంటే, ముందుగా కృష్ణుడే తినాలంటూ బతిమాలుతున్న సూరదాస్ ని చూస్తారు.
వాళ్లకి అక్కడ కృష్ణుడు కనిపించకపోయినా, ఆ పాయసం ఆయన ద్వారానే సూరదాస్ కి చేరిందనే విషయం అర్థమవుతుంది. భగవంతుడు తనకి సమర్పించబడిన నైవేద్యంతో భక్తుడి ఆకలి తీర్చే సంఘటనని ప్రత్యక్షంగా తిలకించగలిగినందుకు వాళ్లు ఆనందపడిపోతారు. శ్రీకృష్ణుడి నామామృతంలో గల మహాత్మ్యం ఎంతటిదో అప్పుడు వాళ్లకి బోధపడుతుంది. దాంతో వాళ్లు సూరదాస్ కి వినయంగా నమస్కారాలు తెలుపుకుని, కృష్ణ నామస్మరణ చేస్తూ అక్కడి నుంచి కదులుతారు.