సంతోషిమాత వ్రత ఫలితం !
శ్రావణమాసంలో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించే వ్రతాలలో 'సంతోషిమాత వ్రతం' ఒకటిగా కనిపిస్తుంది. ఎంతో విశిష్టమైనదిగా చెప్పబడుతోన్న ఈ వ్రతాన్ని శ్రావణ శుక్రవారాల్లో నిర్వహిస్తుంటారు. శ్రావణ పౌర్ణమి రోజున వినాయకుడు తన సోదరి అయిన నాగదేవతతో 'రక్ష' కట్టించుకోవడం చూసి, తమకి కూడా సోదరి కావలిసినదేనంటూ ఆయన కుమారులైన లాభ క్షేమములు పట్టుబడతారు.
అప్పుడు వినాయకుడి సంకల్పంతో ఆయన నేత్రముల నుంచి 'సంతోషిమాత' ఆవిర్భవించినదని చెప్పబడుతోంది. వినాయకుడి ఆదేశం మేరకు ఆమె మానవాళిచే పూజాభిషేకాలు స్వీకరిస్తూ, వ్రతం చేసిన వారిని అనుగ్రహిస్తూ వస్తోంది. వ్రతం చేయాలనుకునే వారు ఎన్ని శుక్రవారాలపాటు చేయాలనేది ముందుగానే అనుకుని ఆ ప్రకారంగా నడచుకోవాలి.
కలశ సహితంగా అమ్మవారిని ఆరాధించి, అరటిపండ్లు ... పుట్నాలు ... బెల్లం నైవేద్యంగా సమర్పించవలసి వుంటుంది. పూజ పూర్తయిన తరువాత బ్రాహ్మణుడికీ ... ముత్తయిదువులకు భోజనం పెట్ట వలసి వుంటుంది. పులుపు గల పదార్థాలను తాను స్వీకరించకపోవడం ... ఇతరులకు ఇవ్వకపోవడం ఈ వ్రత నియమంగా కనిపిస్తుంది.
జీవితంలో అనుకున్నవన్నీ సమకూరినప్పుడు ... వాటిని అనుభవించడానికి అవకాశాన్ని కలిగి వున్నప్పుడు మాత్రమే ఎవరైనా సంతోషంగా వుంటారు. అలా సంతోషంగా ఉండటానికి అవసరమైన ఆయురారోగ్యాలు ... అష్టైశ్వర్యాలు సంతోషిమాత వ్రత ఫలితంగా లభిస్తాయనీ, ఇతర మనోభీష్టాలన్నీ ఆ తల్లి అనుగ్రహంతో నెరవేరతాయని చెప్పబడుతోంది.