అడిగిన వరాలనిచ్చే ఆంజనేయుడు

భగవంతుడిని ఏ విధంగా ఆరాధిస్తే ... ఏ విధంగా సేవిస్తే ఆయన సన్నిధిలో స్థానం లభిస్తుందనేది ఈ లోకానికి చాటిచెప్పినవాడిగా హనుమంతుడు కనిపిస్తాడు. రాముడి రూపాన్ని ఆయన ఎంతలా తన హృదయంలో ముద్రించుకున్నాడనడానికి ఆసక్తికరమైన ఓ సంఘటన నిదర్శనంగా కనిపిస్తూ వుంటుంది.

రామావతార కార్యం పూర్తయిన తరువాత, తిరిగి ఆయన వైకుంఠానికి వెళుతూ వుంటే ... అనుసరించడానికి హనుమంతుడు ఆసక్తి చూపలేదట. కారణమడిగితే ... వైభవంతో వెలుగొందే శ్రీమన్నారాయణుడి రూపం కన్నా, నారబట్టలు ధరించిన సీతారాముడి రూపమే తనకి ఎంతో ఇష్టమనీ, ఆ రూపాన్ని అలాగే తన గుండెల్లో ఉండనీయమని అన్నాడట.

రాముడి పట్ల అంతటి భక్తిశ్రద్ధలు కలిగిన హనుమంతుడు, మరికొంత మంది భక్తులకు కూడా రాముడి దర్శన భాగ్యాన్ని కలిగించాడు. మహా భక్తుడుగానే కాదు ... మనసులోని కోరికలను నెరవేర్చే దైవంగా కూడా హనుమంతుడు అనేక ప్రదేశాల్లో కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తూ వస్తున్నాడు. అలా హనుమంతుడు కొలువైన ఆలయాలలో ఒకటి నల్గొండ జిల్లా 'మిర్యాలగూడెం'లో కనిపిస్తుంది.

ఇక్కడి శివాలయం సమీపంలో అలరారుతోన్న ఈ క్షేత్రాన్ని గురించి తెలియని వాళ్లుండరు. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయంలో స్వామివారి మూర్తి భారీగా దర్శనమిస్తూ వుంటుంది. హనుమంతుడిని దర్శిస్తే ... సమస్త దేవతలను దర్శించిన భాగ్యం లభిస్తుందనీ, ఫలితంగా సమస్త దోషాలు నశిస్తాయని చెప్పబడుతోంది. అందువలన మంగళ - శనివారాల్లో ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా వుంటుంది.

ఆకు పూజలతో ... వడ మాలలతో మొక్కులు చెల్లించుకునే వాళ్ల సంఖ్య ఇక్కడ ఎక్కువగానే వుంటుంది. ముఖ్యంగా హనుమజ్జయంతికి ముందునుంచి ఇక్కడ హనుమ దీక్షలు తీసుకునే వాళ్లు ఎక్కువగా కనిపిస్తుంటారు. హనుమంతుడి దీక్ష తీసుకోవడం వలన మానసిక పరమైన ... శారీరక పరమైన అనారోగ్యాలు నివారించబడతాయనీ, సుఖశాంతులతో కూడిన జీవితం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు.


More Bhakti News