కృష్ణాష్టమికి ఉత్సాహంగా ఉట్టికుండ వేడుక

దశావతారాలలో కృష్ణావతారం పరిపూర్ణమైన అవతారంగా చెప్పబడుతోంది. బాల్యం నుంచి అవతార పరిసమాప్తి వరకూ కృష్ణుడి ప్రతి కదలికలోను ప్రత్యేకత ఉందనే విషయం అర్థమవుతూ వుంటుంది. బాలకృష్ణుడుగా ఆయన చేసిన అల్లరి పనులు ... యవ్వనంలోకి అడుగుపెట్టిన తరువాత ఆయన చేసిన కొంటెపనులు ... గోకులాన్ని రక్షించడం కోసం ఆయన చేసిన సాహసాలు కనులముందు మనోహరమైన దృశ్యరూపాలుగా కదలడుతుంటాయి.

ఇక రుక్మిణీదేవిని ఆయన చేపట్టిన తీరు ... సుభద్ర వివాహం విషయంలో ఆయన చూపిన చొరవను గురించి ఎన్నిమార్లు విన్నా వినాలనిపిస్తూనే వుంటుంది. ఇక రాయబారం చేయడం ... రథసారథ్యం వహించడం వంటి ఘట్టాలు కృష్ణుడి యొక్క లీలావిశేషాలను అద్భుతంగా ఆవిష్కరిస్తూ వుంటాయి. అలాంటి కృష్ణుడు జన్మించిన 'శ్రావణ బహుళ అష్టమి' రోజుని కృష్ణాష్టమి పర్వదినంగా అంతా జరుపుకుంటూ వుంటారు.

ఈ రోజున చాలా ప్రాంతాల్లో ... ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 'ఉట్టికుండ కొట్టడం' అనే వేడుకను నిర్వహిస్తుంటారు. కృష్ణుడి బాల్యక్రీడల్లో 'ఉట్టికుండ కొట్టడం' ఒకటిగా కనిపిస్తూ వుంటుంది. అజ్ఞానమనే కుండను బద్దలుకొట్టి జ్ఞానమనే వెన్నను పదిమందికీ పంచాలనే విషయాన్ని సూచిస్తూ కృష్ణుడు ఈ లీలా విన్యాసం చేశాడని అంటారు. అందువల్లనే ఈ రోజున ఉట్టికుండ కొట్టడాన్ని ఒక వేడుకలా జరుపుతుంటారు. ఆనాటి కృష్ణుడి లీలా విశేషాలను గుర్తుచేసుకుని పరవశించిపోవడం కూడా ఈ వేడుకలోని పరమార్థంగా కనిపిస్తూ వుంటుంది.

రెండు ఎదురు గడలను నిలువుగా పాతి వాటిమీద అడ్డంగా ఒక కమ్మీని ఏర్పాటు చేస్తారు. అడ్డ కమ్మీ మధ్యలో తాడు సాయంతో కొత్త కుండను ఉంచబడిన'ఉట్టి'ని వేలాడదీస్తారు. ఆ కుండలో అటుకులు ... బెల్లం ముక్కలు ... కొబ్బరిముక్కలు ఉంచుతారు. ఉట్టికొట్టే వ్యక్తికి ఆ కుండ దొరక్కుండా ఒకరు దానిని పైకీ కిందకి లాగుతూ ... వదులుతూ వుంటారు. ఆ కుండ ఆ వ్యక్తికి కనిపించకుండా కొందరు అటు ఇటు నిలబడి అతనిపై రంగునీళ్లు చల్లుతుంటారు. ఉత్సాహంతో జరిగే ఈ వేడుక చూడటానికి ఊరంతా అక్కడ చేరుతుంది. సఖ్యతకీ ... సంబరానికి ప్రతీకగా చెప్పుకునే ఈ వేడుక, కృష్ణుడి లీలను ... వినోదాన్ని మేళవిస్తూ ఆయన ఇచ్చిన సందేశాన్ని అందంగా ఆవిష్కరిస్తూ వుంటుంది.


More Bhakti News