కొండగుహలో నుంచి వినిపించిన ఓంకారం !

భూలోకంలో మానవాళిలోని మంచిని రక్షించడానికీ ... దానికి ఆధారభూతమైనటువంటి ధర్మాన్ని కాపాడటానికి భగవంతుడు అనేక రూపాలతో ... నామాలతో ఆవిర్భవించాడు. ఈ నేపథ్యంలో దైవం తాను ప్రకటనం చేసుకోవడానికిగాను అనేక లీలలను ఆవిష్కరించింది. ఆయా క్షేత్రాలను దర్శించినప్పుడు ముందుగా ఈ విషయాలే ఆసక్తికరంగా వినిపిస్తుంటాయి ... ఆశ్చర్యకరంగా అనిపిస్తుంటాయి.

అలాంటి క్షేత్రం ఒకటి మనకి రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం ... 'గండిచెరువు'లో కనిపిస్తుంది. ఇక్కడి గుట్టపై శ్రీమన్నారాయణుడు గోదాసమేత రంగనాథస్వామిగా దర్శనమిస్తూ వుంటాడు. సాధారణంగా భగవంతుడు భక్తులకు స్వప్నంలో కనిపించి తన జాడ తెలుపుతూ వుంటాడు. అందుకు భిన్నంగా ఇక్కడి దేవుడు ఓంకారాన్ని ధ్వనింపజేశాడు. ఆ వైనాన్ని గురించి తెలుసుకోవాలంటే కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్లవలసి వుంటుంది.

ఒకసారి ఇక్కడి గుట్టపై గల గుహలో నుంచి 'ఓంకారం' వెలువడుతూ వుండటం అక్కడి పశువుల కాపరులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. లోపల ఏవుందో చూడటానికి గుంపుగా వెళ్లిన వాళ్లు ... అక్కడున్న పెద్ద పుట్టలో నుంచి వెలుగు ... దానితో పాటు ఓంకార ధ్వని వస్తుండటం చూశారు. దగ్గరికి వెళ్లి చూడగా అందులో రంగనాథస్వామి భారీ స్వయంభువు మూర్తి కనిపించింది. అలా స్వామి వెలుగులోకి రావడం జరిగింది.

ఇక ఇక్కడి స్వామి రాత్రి సమయాల్లో పంటపొలాల్లో విహరిస్తూ ఉంటాడట. అందుకు నిదర్శనంగా అప్పుడప్పుడు పొలం గట్లపై పెద్ద పెద్ద పాదముద్రలు కనిపిస్తూ ఉంటాయని చెబుతుంటారు. ఆయన చల్లని చూపు వలన ... పాదస్పర్శ వలన తమ పంటలు మరింత బాగా పండుతుంటాయని వాళ్లు ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఇక్కడ స్వామి ప్రత్యక్షంగా ఉన్నాడని భావిస్తూ ... అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయనను ఆరాధిస్తూ వుంటారు.


More Bhakti News