కొండపై నిండుగా కొలువైన దేవుడు
పూర్వం రాజులు కొండ ప్రదేశాలను తమ రక్షణ కేంద్రాలుగా ... నివాస స్థానాలుగా చేసుకుని అక్కడి నుంచే పరిపాలన కొనసాగించేవారు. శత్రువులు దాడి చేయడానికి వస్తుంటే దూరం నుంచే పసిగట్టడానికీ, తమ సైన్యాన్ని అప్రమత్తం చేసి వాళ్లను ఎదుర్కోవడానికి కొండలపై కోటలు నిర్మించేవారు. అదే సమయంలో తాము అనునిత్యం దర్శించుకోవడానికి ఆలయాలను కూడా నిర్మింపజేసుకునేవారు. కోటలో భాగంగా నిర్మించబడిన ఈ ఆలయాలు ఆనాటి రాజుల భక్తి శ్రద్ధలకు నిదర్శనంగా కనిపిస్తూ వుంటాయి.
రాజులు ... రాజ్యాలు పోయాక అక్కడి గ్రామస్తులు ఆ దైవాలను దర్శిస్తూ ... సేవిస్తూ వస్తున్నారు. అలా కొండపై కోటతో సమానమైన చరిత్రను కలిగివున్న ఆలయాలలో ఒకటిగా 'అనంతగిరి' లోని రామాలయం దర్శనమిస్తూ వుంటుంది. నల్గొండ జిల్లా కోదాడ మండల పరిధిలో ఈ కొండ కనిపిస్తూ వుంటుంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఒక సామంత రాజు ఇక్కడి కొండపై కోటను నిర్మించినట్టు చెబుతారు. కృష్ణదేవరాయలు తన విజయయాత్రలో భాగంగా ఈ కోటను కూడా దర్శించాడని అంటారు.
ఇప్పటికీ ఇక్కడి కొండపై ఆనాటి రాజమందిరాల ఆనవాళ్లు శిధిలావస్థలో కనిపిస్తూ వుంటాయి. అలనాటి రామాలయం మాత్రం భక్తుల కారణంగా నేటికీ నిత్య ధూప దీప నైవేద్యాలతో వెలుగొందుతూ వుంది. ఇక్కడి రాముడి విగ్రహాన్ని చూసిన వాళ్లు, జగన్మోహనాకారం అంటే ఇదేనేమోనని అనుకోకుండా ఉండలేరు. అంతటి సౌందర్యం ఆయనలో ఉట్టిపడుతూ వుంటుంది. గర్భాలయంలో సీతారామలక్ష్మణులు కొలువై వుండగా, వారికి ఎదురుగా హనుమంతుడు దర్శనమిస్తూ వుంటాడు.
శ్రీరామనవమి సందర్భంగా జరిగే కల్యాణోత్సవంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొంటూ వుంటారు. కొండపై నున్న కోదండరాముడే తమని కాపాడుతూ ఉంటాడని భావిస్తూ, ఆయన అభయాన్ని తీసుకుంటూ వుంటారు. చారిత్రక పరమైన నేపథ్యం గల ఈ ఆలయాన్ని దర్శించడం వలన అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.