వ్యాధులను నివారించే శీతలాదేవి
పూర్వం అంటువ్యాధుల భయం విపరీతంగా వుండేది. పేరు ఏదైనా ఒకరి నుంచి ఒకరికి సోకే ఈ వ్యాధుల వలన మరణించేవారి సంఖ్య ఎక్కువగా ఉండేది. ఒక్కోసారి ఈ అంటువ్యాధుల కారణంగా గ్రామాలకు ... గ్రామాలు ఖాళీ అవుతూ ఉండేవి. దాంతో అంటువ్యాధుల పేరు వినగానే గ్రామస్తులు తీవ్రమైన భయాందోళనలకు లోనయ్యేవారు. ఇక తమని అమ్మవారే కాపాడాలని భావించి, అంతాకలిసి 'శీతలాదేవి'ని పూజించేవారు.
శీతలాదేవి అంటే సాక్షాత్తు జగన్మాత అయిన పార్వతీదేవియే. ఆ తల్లి అనుగ్రహంతో అంటువ్యాధులు నివారించబడతాయని గ్రామస్తులు విశ్వసిస్తూ వుంటారు. అలా వివిధ రకాల రోగాల నుంచి వ్యాధుల నుంచి విముక్తిని కలిగించే శీతలాదేవిని 'శ్రావణ బహుళ అష్టమి' రోజున పూజిస్తుంటారు. శ్రావణ బహుళ అష్టమిని 'కృష్ణాష్టమి'గా జరుపుకుంటూ వుంటారు.
నారాయణుడి సోదరిగా చెప్పబడే అమ్మవారి అనుగ్రహాన్ని కోరుతూ ఆ తల్లికి ప్రత్యేక పూజలందించే ఈ రోజుని 'శీతలాష్టమి' అని కూడా పిలుస్తుంటారు. ఈ రోజున చాలామంది కుటుంబసభ్యులతో కలిసి 'శీతలావ్రతం' ఆచరిస్తూ వుంటారు. ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు ఎల్లప్పుడూ తమపై వుండాలని ఆశిస్తూ 'శీతలాష్టకం'పఠిస్తారు. అమ్మవారికి ఇష్టమైన పులిహోర ... పాయసం ... పెరుగన్నం నైవేద్యంగా సమర్పిస్తుంటారు.
భక్తిశ్రద్ధల పరంగాను ... ప్రేమానురాగాల పరంగాను అమ్మవారిని సంతోషపెట్టడం వలన ఎలాంటి వ్యాధులు దరిచేరవని అందరూ విశ్వసిస్తూ వుంటారు. ఇక ఇదే రోజున అమ్మవారి ప్రీతీ కొరకు కొంతమంది 'చండీహోమం' చేయిస్తుంటారు. ఈ చండీహోమం చేయించడం వలన సమస్త దోషాలు ... గ్రహ సంబంధమైన పీడలు తొలగిపోయి శుభాలు చేకూరతాయని చెబుతుంటారు.