అందుకే ఆమె ఆయనని ఆరాధించింది !
నల మహారాజు గుణగణాలను గురించి తెలుసుకున్న దమయంతి, ఆయనని ఆరాధిస్తూ వుంటుంది. ఆయన రూపాన్ని ఊహించుకుంటూ కాలం గడుపుతూ వుంటుంది. ఇక దమయంతి అందచందాలను గురించి తెలుసుకున్న ఆయన, ఆమెను చూసే అవకాశం కోసం ఎదురుచూస్తూ వుంటాడు. ఆ పరిస్థితుల్లోనే దమయంతి తండ్రి ఆమెకి స్వయంవరాన్ని ప్రకటిస్తాడు.
దిక్పాలకులైనటు వంటి ఇంద్రుడు .. అగ్ని.. వరుణుడు .. యముడు ఈ స్వయంవరానికి హాజరుకావాలని నిర్ణయించుకుంటారు. నలుడిపై దమయంతి మనసు పారేసుకుందని తెలుసుకుని ఆయనను కలుసుకుంటారు. ఆయన సాయాన్ని కోరి వచ్చినట్టు చెబుతారు. అది ఎలాంటి సాయమైనా చేస్తానని ముందుగానే నలుడు మాట ఇస్తాడు. అప్పుడు వాళ్లు దమయంతి స్వయంవర విషయాన్ని ప్రస్తావిస్తారు. తమలో ఒకరిని వివాహం చేసుకోవలసిందిగా ఆమెని ఒప్పించమని కోరతారు.
తాను ప్రేమిస్తోన్న యువతితో ... తనని ఆరాధిస్తోన్న యువతితో వేరొకరిని వివాహం చేసుకోమని ఎలా చెప్పగలడు ? అయినా ఇచ్చిన మాటకి కట్టుబడి అందుకు నలుడు అంగీకరిస్తాడు. దేవతలు ప్రసాదించిన శక్తితో అదృశ్య రూపంలో వెళ్లి దమయంతిని కలుసుకుంటాడు. తాను నలుడినని చెప్పకుండా ... ఆమె స్వయంవరానికి రానున్న ఇంద్రుడు మొదలైనవారి గురించి చెబుతాడు. వారిలో ఒకరిని వివాహమాడవలసిందిగా కోరతాడు.
అతని గురించిన వివరాలను దాస్తూ ... తన స్వయంవర విషయాలను గురించి మాట్లాడుతూ వుండటం పట్ల దమయంతి అసహనాన్ని ప్రదర్శిస్తుంది. స్వయంవరానికి ఎవరు వచ్చినా తన చేతిలోని పూలహారం నలుడి మెడలోనే పడుతుందనీ, తన మనసులో నల మహారాజుకి తప్ప మరెవరికీ స్థానం లేదని చెబుతుంది. ఆమె ఒక స్థిరమైన నిర్ణయానికి కట్టుబడివుందని తెలిసిన తరువాత, తానే నలుడిననే విషయాన్ని ఆయన బయటపెడతాడు.
ముందుగా చెబుతే ఇంద్రుడికి ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుందని అలా చేశానని అంటాడు. తాను వచ్చిన పని పూర్తయిందంటూ అక్కడి నుంచి సెలవుతీసుకుంటాడు. తనని ప్రేమిస్తూ కూడా ఇంద్రుడికి ఇచ్చిన మాటకి కట్టుబడి తనని ఒప్పించడానికి ప్రయత్నించిన నలుడి వ్యక్తిత్వాన్ని దమయంతి మనసులోనే అభినందిస్తుంది. ఈ సంఘటనతో నలుడిపై ఆమెకి గల ప్రేమ మరింత రెట్టింపు అవుతుంది.