బాబాను విశ్వసిస్తే బాధలు దూరమే !
ఫకీరుగా శిరిడీలో అడుగుపెట్టిన సాయిబాబా ... అక్కడి వాళ్లందరినీ ఎంతగానో ప్రేమించాడు. వాళ్లు అనారోగ్యం బారిన పడకుండా ఉండటం కోసం ... ఆపదల్లో పడకుండా ఉండటం కోసం ... ఆకలితో బాధపడకుండా ఉండటం కోసం తాను చేయగలిగినంత చేశాడు. మానవత్వాన్ని మేల్కొల్పడం కోసం ... సమానత్వాన్ని సాధించడం కోసం ఎంతో కృషి చేశాడు.
జీవితాన్ని ఎంత నిరాడంబరంగా కొనసాగించాలి ... గురువు అనుగ్రహం ఎలా లభిస్తుందనేది ఆయన ఎవరికీ పాఠాలుగా చెప్పలేదు. జనం మధ్య వుంటూనే ... వారిని కంటికి రెప్పలా కాపాడుతూనే అసలు విషయం వాళ్లకి బోధపడేలా నడచుకున్నాడు. ఆనాడు సాయిని ప్రత్యక్షంగా సేవించినవాళ్ళే కాదు, ఈ రోజున సాయిని ఆరాధించే వాళ్లు కూడా ఆయన తమని వెన్నంటి రక్షిస్తూ ఉంటాడని నమ్ముతుంటారు.
ఈ కారణంగానే ప్రతి గ్రామంలోను సాయి ఆలయాలు నిర్మితమవుతూ వస్తున్నాయి. ప్రశాంతతకు ... పవిత్రతకు ప్రతీకలుగా అవి అలరారుతున్నాయి. అలాంటి సాయి ఆలయాలలో ఒకటి గుంటూరు జిల్లా 'పెదవడ్లపూడి'లో దర్శనమిస్తుంది. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఇక్కడి సాయి ఆలయం, భక్తుల అంకితభావానికి అద్దంపడుతూ వుంటుంది.
విశాలమైన ప్రధాన మంటంలో నిలుచున్న భక్తులకు వేదికపై గల బాబా వెన్నెల రూపంలా ప్రశాంతంగా కనిపిస్తూ వుంటాడు. ఆయన చూపులు కష్టాలను కరిగిస్తున్నట్టుగా .. బాధలను తొలగిస్తున్నట్టుగా .. ఓదారుస్తున్నట్టుగా .. ధైర్యం చెబుతున్నట్టుగా .. ఆయా సమస్యలతో అక్కడికి వచ్చిన భక్తులకు అనిపిస్తుంటాయి. ఎంతో మందిని ఎన్నో రకాలుగా ఆదుకున్నావు ... నీనొక్కడిని నీకు ఎక్కువైపోతానా ? అనే ప్రతి ఒక్కరూ ఆయనని అడుగుతుంటారు. పరిపూర్ణమైన విశ్వాసాన్ని ప్రకటించిన ప్రతి ఒక్కరూ అందుకు తగిన ప్రతి ఫలాన్ని పొందుతుంటారు.
శిరిడీలో మాదిరిగానే ఇక్కడ సాయికి అభిషేకాలు ... అలంకారాలు ... హారతులు జరుగుతుంటాయి. పల్లకీ ఉత్సవం ... ఊయల సేవ నిర్వహిస్తుంటారు. ప్రతి సేవలోను ... ఆయన పట్ల అందరూ వ్యక్తం చేసే ప్రేమ మనసుకి మరింత ఆహ్లాదాన్ని పంచుతుంది. ఇక్కడి వాళ్ళంతా ప్రతి పండగకి ఆయనని ఆహ్వానిస్తారు ... ఆయన సమక్షంలోనే సంతోషాలు పొందుతారు.