హరిహరుల అనుగ్రహాన్ని అందించే క్షేత్రం
కాకతీయులు పరమశివుడి పట్ల తమకి గల ప్రేమను, విష్ణుమూర్తి పట్ల తమకి గల ఆరాధనా భావాన్ని చాటుకున్నారు. ఈ కారణంగానే వాళ్ల పరిపాలనా కాలంలో అటు శివాలయాలు ... ఇటు వైష్ణవ ఆలయాలు నిర్మించబడ్డాయి. మరెన్నో ప్రాచీనకాలం నాటి ఆలయాలు అభివృద్ధి చేయబడ్డాయి. శివుడు - విష్ణువు కలిసి ఒకే ప్రాంగణంలో పూజాభిషేకాలు అందుకోవడానికి కొన్నిచోట్ల ఏర్పాట్లు చేయబడ్డాయి.
అలా కాకతీయుల కాలంలో నిర్మించబడి ... వెలుగొందిన శివకేశవ క్షేత్రాల్లో ఒకటి 'తొగర్రాయి' అనే గ్రామంలో కనిపిస్తుంది. నల్గొండ జిల్లా ... కోదాడ మండలంలో ఈ క్షేత్రం అలరారుతోంది. ఇక్కడ శివాలయం ... వేణుగోపాలస్వామి ఆలయం పక్కపక్కనే కొలువై వుండటం విశేషంగా అనిపిస్తుంది. కోరిన వరాలను ప్రసాదించే కొండంత దైవాలుగా శివకేశవులు కొలువుదీరి వుండటం తమ అదృష్టంగా గ్రామస్తులు భావిస్తుంటారు.
ఇక్కడి శివుడిని దర్శించుకుంటే ఆపదల నుంచి గట్టెక్కిస్తాడనీ, కృష్ణయ్యను సేవిస్తే కష్టాలను తొలగించి సుఖసంతోషాలను అందిస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ కారణంగా మహాశివరాత్రి ... కృష్ణాష్టమి వంటి పర్వదినాల్లో ఈ ఆలయాలు మరింత శోభను సంతరించుకుని కనిపిస్తాయి. ఈ సమయాల్లో ఘనంగా జరిగే ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటూ వుంటారు. హరిహరుల సేవలో తరిస్తూవుంటారు.