ఆపదల నుంచి రక్షించే దేవుడు
కలియుగ దైవమైన వేంకటేశ్వరస్వామి లీలా విశేషాలను అర్థం చేసుకోవడం చాలాకష్టం. మహర్షుల అభ్యర్థన మేరకు స్వయంభువుమూర్తిగా ఒకచోట కొలువుదీరతాడు. మరోచోట భక్తుడి కోరికమేరకు, తన పాదముద్రలను మాత్రమే వదిలి వెళతాడు. ఒక చోట సువిశాలమైన కొండ మధ్య భాగంలో నిలుచుని వెలుస్తాడు. ఒకచోట బండరాళ్ల మధ్య శయనముద్రలో కనిపిస్తాడు.
ఇక దర్శించుకోవడమే కష్టమయ్యే గుహలను ... కొండ బొరియలను కూడా ఆయన తన నివాస స్థానంగా చేసుకుని భక్తులకు దర్శనమిస్తూ వుంటాడు. ఎక్కడ వెలసినా వేంకటేశ్వరుడే ... ఎలా వెలిసినా అది ఆయన లీలా విశేషమేనని భక్తులు అనుకుంటూ వుంటారు. తమ మనసులోని భారం దించుకోవడానికి దూరాన్ని సైతం లెక్కచేయకుండా ఆయన దర్శనం కోసం వస్తుంటారు. అలా భక్తులతో నిత్యనీరాజనాలు అందుకుంటోన్న వేంకటేశ్వరస్వామి క్షేత్రం ఒకటి 'బరాఖత్ గూడెం'లో దర్శనమిస్తుంది.
నల్గొండ జిల్లా నడిగూడెం మండలంలో ఈ క్షేత్రం అలరారుతోంది. ఇక్కడి వేంకటేశ్వరుడు కొండ బొరియలో వెలసిన మూర్తిగా కనిపిస్తూ వుండటం విశేషం. గ్రామస్తులు స్వామివారికి ఆలయాన్ని నిర్మించి అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ వుంటారు. పర్వదినాల్లో ఆయన భజనల్లో తరిస్తుంటారు. ఇక్కడి స్వామిని దర్శిస్తే ఆపదల నుంచి రక్షిస్తాడనీ, అడిగిన వరాలను ఇస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు.