కృష్ణాష్టమి రోజున చేయవలసిన పారాయణం

వైకుంఠంలో శ్రీమన్నారాయణుడి దర్శనం చేసుకోవాలంటే అందుకు వేల జన్మల పుణ్యం వెంటరావాలి. అక్కడ ఆ స్వామి దర్శనం దేవతలకు ... మహర్షులకు ... మహాభక్తులకు మాత్రమే తప్ప, సాధారణ మానవులకు సాధ్యం కాదు. అలాంటిది ఆ శ్రీమన్నారాయణుడే మానవులకు జ్ఞానబోధ చేయడానికీ ... వాళ్లని ధర్మమార్గంలో నడిపించడానికి మానవ గర్భాన కృష్ణుడుగా జన్మించాడు.

శ్రావణ బహుళ అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో ఆయన జన్మించడం వలన ఈ రోజున ఆయన జన్మదినాన్ని 'కృష్ణాష్టమి'గా భక్తులంతా జరుపుకుంటూ వుంటారు. ఈ రోజు ఉదయాన్నే స్నానం చేసి ... పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి ... మామిడి తోరణాలతోను .. పూలమాలికలతోను ఇంటిని అలంకరిస్తూ వుంటారు.

కృష్ణుడి ప్రతిమనుకానీ ... చిత్రపటాన్నిగాని అందంగా అలంకరిస్తారు. షోడశ ఉపచారాలతో కృష్ణుడిని సేవించి, ఆయనకి ఇష్టమైన పాలు .. పెరుగు .. వెన్న .. మీగడలతో పాటు పిండివంటలను నైవేద్యంగా సమర్పించి సంతోషపడిపోతారు. ఈ నేపథ్యంలో కొంతమంది ఆయన లీలలు గానం చేస్తారు ... మరికొందరు బాలకృష్ణుడుకి ఊయలకట్టి ఆయన బాల్యక్రీడలను లాలి పాటలుగా ... జోలపాటలుగా పాడుతూ సంతృప్తి చెందుతారు.

అవతారపురుషుడైన ఆ కృష్ణుడి అనుగ్రహాన్ని పొందాలంటే ఈ రోజున ఏ పారాయణం చేస్తే బాగుంటుందనే సందేహం కొంతమందికి కలుగుతూ వుంటుంది. విశిష్టమైనటువంటి ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం ... గీతాపారాయణం చేయడం విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం ... గీతాపారాయణం చేయడం వలన, వివిధ పాపాల ఫలితంగా వెంటాడుతోన్న కష్టాలు తొలగిపోయి ధర్మబద్ధమైన కోరికలు సత్వరమే నెరవేరుతాయని చెప్పబడుతోంది.


More Bhakti News