సదాశివుడి క్షేత్రానికి రక్షణగా సర్పరాజు
సాధారణంగా శ్రీమహావిష్ణువు కొలువైన క్షేత్రాలలో శివుడు క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తూ వుంటాడు. అలాగే శివుడు కొలువుదీరిన క్షేత్రాల్లో విష్ణుమూర్తి క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తూ వుంటాడు. ఆయా క్షేత్రాలకి సంబంధించిన దైవ సంబంధిత విషయాలను క్షేత్ర పాలకులే చూస్తుంటారు. ఈ నేపథ్యంలో దేవతా సర్పాలు కనిపెట్టుకునుండే క్షేత్రాలు కూడా లేకపోలేదు.
విశిష్టమైనటువంటి కొన్ని శైవ క్షేత్రాల్లో నేటికీ సర్పాలు సంచరిస్తూనే వున్నాయి. ఎవరికి ఎలాంటి హాని చేయకుండగా గర్భాలయంలోకి సర్పం వచ్చి వెళుతూ వుండటం వంటి సంఘటనలను కూడా మనం వింటూనే వున్నాం. అలా సర్పంచేత రక్షించబడుతోన్న క్షేత్రం ఒకటి నల్గొండ జిల్లా 'సాధువల్లి' గ్రామ సమీపంలో కనిపిస్తుంది.
చాలాకాలం క్రిందట ఇక్కడి కొండపై ఒక స్వయంభువు శివలింగం వెలుగుచూసింది. ఆ రోజు నుంచి చుట్టుపక్కల గ్రామస్తులు స్వామికి పూజాభిషేకాలు జరిపిస్తూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆ శివలింగం వున్న ప్రదేశంలో 'గుప్తనిధులు' ఉన్నాయనే ప్రచారం మొదలైంది. గుప్తనిధులు అనే అంశం అందరికీ ఆసక్తిని కలిగించేది కావడంతో, ఆ ప్రచారం మరింత జోరందుకుంది.
తేలికగా ధనం సంపాదించడానికి ఇంతకన్నా మంచిమార్గం లేదనుకున్న కొంతమంది ఈ ప్రచారాన్ని నమ్మారు. ఒక రాత్రివేళ గుప్తనిధుల కోసం శివలింగం గల ప్రదేశానికి వెళ్లారట. అక్కడ శివలింగానికి చుట్టుకుని వున్న మహాసర్పాన్ని చూసి తలో దిక్కున పారిపోయి ఇళ్లకు చేరుకున్నారు. ఆ రోజు నుంచి ఆ మహాసర్పం ఇక్కడి పరిసరాల్లోనే తిరుగుతూ ఇప్పటికీ చాలామందికి కనిపిస్తూ ఉంటుందట.
భక్తితో స్వామి దర్శనం కోసం వచ్చేవారికి ఈ సర్ప ఎదురుపడినప్పుడు పక్కకి తప్పుకుని వెళ్లిపోతుందట. ఇక దురుద్దేశంతో ఎవరైనా ఈ క్షేత్రంలోకి అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తే వాళ్ల దారికి అది అడ్డుగా నిలుస్తుందట. అందుకే ఇక్కడి శివయ్య దగ్గరికి మరో ఉద్దేశంతో వచ్చే సాహసానికి ఎవరూ పూనుకోరు. ఇక్కడ శివుడు ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడనీ, ఈ కారణంగానే సర్పరాజు ఆయనను సేవిస్తూ ... ఈ క్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటాడని భక్తులు విశ్వసిస్తూ వుంటారు.