కొండ చరియల మధ్య కొలువైన దేవుడు

సాధారణంగా ఎత్తయిన కొండలు గల ప్రదేశాలకి వెళ్లడానికీ, అక్కడి లోయలను చూడటానికి చాలామంది భయపడుతుంటారు. విశాలంగా పరచుకున్న కొండలను చూస్తే, ఈ ప్రపంచానికి సంబంధంలేని చోట ఉండిపోయినట్టుగా ఆందోళన చెందుతూ వుంటారు. ఇక ఇదే సమయంలో జలపాతాలు చేసే హోరు కూడా మనసులో అలజడి సృష్టిస్తూ వుంటుంది. అనవసరంగా అక్కడికి వచ్చావేమోననుకుని, సాధ్యమైనంత త్వరగా అక్కడి నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తుంటారు.

ఆ కొండల నడుమ దేవుడు వెలిశాడనీ, ఎంతోమంది దేవతలు ... మహర్షులు ఆ స్వామిని పూజించి పునీతులయ్యారని తెలిస్తే పరిస్థితి వేరుగా వుంటుంది. అంతముందు భయంకరంగా కనిపించిన ప్రదేశమే ఇప్పుడు అందంగా కనిపిస్తూ ఆనందాన్ని కలిగిస్తుంది. ఎంత కష్టమైనా దైవదర్శనం చేసుకోవలసిందేనంటూ ముందడుగు వేస్తారు. అలా పచ్చని ప్రకృతి ఒడిలో ... కొండచరియల మధ్యలో కొలువై, భక్తులను రప్పిస్తోన్న వీరభద్రేశ్వరుడు ఆలయం'చిక్ మగలూర్' లో కనిపిస్తుంది.

అగస్త్యమహర్షి కొంతకాలం పాటు ఇక్కడ తపస్సు చేసుకున్నాడట. ఇక్కడి స్థల మహాత్మ్యం గురించి తెలుసుకున్న విజయనగర రాజులు స్వామివారికి ఆలయాన్ని నిర్మించినట్టు చెబుతారు. ఇక్కడి కొండపై నుంచి దూకే జలపాతం ... వీరభద్రేశ్వరుడి ఆలయ ప్రదేశాన్ని స్పర్శిస్తూ ప్రవహిస్తూ వుంటుంది. మనోహరమైన ఈ దృశ్యం మనోఫలకంపై ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇది పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందడం వలన, ఇక్కడికి వచ్చే యాత్రికుల సంఖ్య ఎక్కువగానే వుంటుంది. వినోదం కోసం విహారానికి వచ్చే వాళ్లంతా ఇక్కడి స్వామిని దర్శించుకుని, ఆధ్యాత్మిక పరమైన అనుభూతిని కూడా పొందుతూ వుంటారు.


More Bhakti News