భార్యాభర్తల బంధానికి నిదర్శనం !
నవద్వీప మహారాజు ఆశ్రయంలో ఉంటూ 'గీతగోవిందం' కావ్యాన్ని రచిస్తూ వుంటాడు జయదేవుడు. ఆ కావ్యం పట్ల గల ఆసక్తితో మహారాజు జయదేవుడి ఇంటికి వస్తూ ఉండేవాడు. ఆయనతో పాటు మహారాణి కూడా వస్తూ వుండటం వలన జయదేవుడి భార్య పద్మావతీదేవితో ఆమెకి స్నేహం ఏర్పడుతుంది.
ఒకరోజున మహారాణి సోదరుడు మరణించడంతో, అతని భార్య సహగమనానికి ఏర్పాట్లు జరుగుతూ వుంటాయి. సహగమనం అంటే బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం కాదనీ, భర్త మరణవార్త విన్న వెంటనే భార్య కూడా ప్రాణాలు వదిలేయడమని అంటుంది పద్మావతీదేవి. అలా మరణించడం పాతివ్రత్యాన్ని సూచిస్తుందనీ, పుణ్యలోకాలను ప్రసాదిస్తుందని చెబుతుంది.
పద్మావతీదేవి చాలా సాధారణంగా అన్న మాటలను ఆమె అహంకారానికి నిదర్శనంగా మహారాణి భావిస్తుంది. జయదేవుడి పట్ల పద్మవతీదేవికి గల ప్రేమానురాగాలు ఎలాంటివో తెలుసుకోవాలని అనుకుంటుంది. ఒకసారి మహారాజు ఓ పుణ్య క్షేత్రానికి వెళుతూ జయదేవుడిని వెంటతీసుకుని వెళతాడు. పద్మావతీదేవి పతిభక్తిని పరీక్షించడానికి అదే అదనుగా భావించిన మహారాణి, చెలికత్తెని పిలిచి ఏం చేయాలనేది చెబుతుంది.
పద్మవతీదేవితో మహారాణి మాట్లాడుతూ వుండగా, ఆ చెలికత్తె కంగారుని నటిస్తూ అక్కడికి పరిగెత్తుకు వస్తుంది. మహారాజుతో దైవ దర్శనానికి వెళ్లిన జయదేవుడు అక్కడ ప్రమాదవశాత్తు మరణించాడని చెబుతుంది. అంతే కూర్చున్న చోటునే పద్మావతీదేవి తన ప్రాణాలను వదిలేస్తుంది. దైవ దర్శనం నుంచి తిరిగి వచ్చిన మహారాజు ... జయదేవుడు జరిగింది తెలుసుకుని ఎంతగానో బాధపడతారు.
తన భార్యను బతికించమంటూ జయదేవుడు కృష్ణుడిని ప్రార్ధిస్తాడు. పరమాత్ముడు ఆయన మొరను ఆలకించడంతో పద్మావతీదేవి నిద్రనుంచి మేల్కొనట్టుగా లేచి కూర్చుంటుంది. అద్భుతమైన ఈ సంఘటన జయదేవుడి భక్తినీ ... పద్మావతీదేవి పాతివ్రత్యాన్ని ఈ లోకానికి చాటిచెప్పింది.