నక్కలను పూజించడం ఇక్కడి ప్రత్యేకత !
ఎవరికైనా అనుకోకుండా కలిసొస్తే నక్కతోక తొక్కాడురా అని చెప్పుకోవడం వింటూ వుంటాం. అంటే నక్కతోక తొక్కడం వలన అదృష్టవంతులు అవుతారని కొందరు భావిస్తూ వుంటారనే విషయం ఇక్కడ అర్థమవుతూ వుంటుంది. నక్కతోక తొక్కడం వలన అదృష్టం వరించడమనే సంగతి అటుంచితే, నక్కలను పూజించడం వలన మంచి జరుగుతుందని నమ్మేవాళ్లు కూడా లేకపోలేదు. అలా విశ్వసించే వాళ్లు కర్ణాటక ప్రాంతం ... 'కాడబహళ్లి' అనే గ్రామంలో కనిపిస్తూ వుంటారు.
నక్కలను పూజించడమనేది ఈ గ్రామంలో ఒక ఆచారంగా కనిపిస్తూ వుంటుంది. చాలా ప్రాచీనకాలం నాటి నుంచి ఇక్కడ ఈ ఆచారం వుందని స్థానికులు చెబుతుంటారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ రోజులలో ఇక్కడ ఈ పూజ జరుగుతూ వుంటుంది. సంక్రాంతి పండుగ దగ్గరికి వస్తోందనగానే, ఈ గ్రామంలోని యువకులు నక్కలను పట్టే వలలను సిద్ధం చేసుకుంటారు. ఓ శుభ ముహూర్తాన నక్కలను పట్టుకునేందుకు గుంపులుగా బయలుదేరుతారు.
యువకులంతా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటూ వుంటారు. సంక్రాంతి పండుగ జరుపుకునే మూడు రోజుల పాటు ఆ వలలతో నక్కలను బంధించి, స్థానికంగా వున్న ఆలయం దగ్గరికి తీసుకు వస్తారు. బోనుల్లో ఉంచిన నక్కలను పూజించి ... తిరిగి వాటిని వదిలేస్తారు. ఈ విధంగా చేయడం వలన తమ గ్రామంలోని ప్రజలందరికీ శుభం జరుగుతుందని వాళ్లు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.