కృష్ణాష్టమి రోజున నైవేద్యాలు ఇవే !
తెలుగువారు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో 'కృష్ణాష్టమి' ఒకటిగా కనిపిస్తూ వుంటుంది. 'శ్రావణ బహుళ అష్టమి'ని కృష్ణాష్టమిగా జరుపుకుంటూ వుంటారు. పరమాత్ముడు బాలకుడై ... గోపాలకుడై జరుపుకునే పుట్టినరోజు ఇది. ఈ రోజున ఆయనని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించి ... ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించవలసి వుంటుంది.
సాధారణంగా మిగతా దేవుళ్లకి ఏ నైవేద్యాలు ఇష్టమంటే చెప్పడం కష్టమే. అదే కృష్ణుడి విషయానికి వచ్చేసరికి ఆవుపాలు .. వెన్నమీగడలు అని చకచకా చెప్పేస్తుంటారు. వాటినే ఈ రోజున ఆయనకి నైవేద్యంగా సమర్పించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. దుష్టులను శిక్షించడం కోసం ... శిష్టులను రక్షించడం కోసం ... ధర్మాన్ని పరిరక్షించడం కోసం శ్రీమన్నారాయణుడు భూలోకంలో శ్రీకృష్ణుడుగా అవతరించాడు. ఈ నేపథ్యంలో ఆయన బాల్యక్రీడలు ఆనందకరంగా ... ఆసక్తికరంగా కొనసాగాయి.
బాలకృష్ణుడుగా ... నల్లనయ్యగా ... కన్నయ్యగా పిలిపించుకుంటూ రేపల్లెలో ఆయన చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఈనాటికీ ఈ దృశ్యాలకి సంబంధించిన చిత్రపటాలు తెలుగు లోగిళ్లలో కనిపిస్తూనే వుంటాయి. గోవులకు ... గోపాలకులకు రక్షణగా 'గోవర్ధన గిరి'ని గొడుగులా పట్టిన ఘనత ఆయనది. గోవుల పట్ల ఇష్టంతోనే ఆయన గోపాలకుడయ్యాడు. వాటిపట్ల ప్రేమతోనే ఆవుపాలను ... వెన్నమీగడలను ఎంతో ప్రీతికరంగా ఆరగించాడు.
వెన్న మీగడలను దొంగిలించినా ముందుగా మిగతా గోపలకులకు పెట్టేవాడు. అలాగే ఏ ఇంట్లోనైతే తాను వెన్న మీగడలను దొంగిలించాడో వాళ్ల ఇంట పాడిని మరింత ఎక్కువగా అనుగ్రహించేవాడు. కృష్ణా అంటేనే కష్టాలు తీరిపోతాయి. అలాంటిది ఆయనే స్వయంగా వచ్చి పాలు .. వెన్న ఆరగిస్తానంటే ఆనందంతో అందించని వాళ్లెవరుంటారు. ఆయన రావాలనే ప్రతి ఇంటా ఈ రోజున 'కృష్ణ పాదాలు' గుమ్మంలో నుంచి ఇంట్లోకి పెడతారు. ఆయనకి ఇష్టమైన పాలు ... వెన్న మీగడలు ... అటుకులు నైవేద్యంగా సమర్పిస్తుంటారు.