రాఘవేంద్రుడుని దర్శించుకున్న వీరశివాజీ
రాఘవేంద్రస్వామి తన శిష్య గణంతో కలిసి వివిధ ప్రాంతాలను దర్శిస్తూ వుంటాడు. ఈ క్రమంలోనే ఆయన గురించి శివాజీ మహారాజు వింటాడు. రాఘవేంద్రస్వామి మహిమలను గురించీ .. ప్రజల్లో ఆయన పట్ల గల భక్తి విశ్వాసాలను గురించి తెలుసుకుంటాడు. అలాంటి మహానుభావుడిని ఒకసారి దర్శించి తీరాలని నిర్ణయించుకుంటాడు.
అనుకున్నదే తడవుగా రాఘవేంద్రస్వామి విడిది చేసిన ప్రదేశాన్ని గురించి తెలుసుకుని అక్కడికి వెళతాడు. దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతున్న రాఘవేంద్రస్వామిని చూసి అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతాడు. మహారాజు ... భవానీదేవి భక్తుడు అయిన ఆయనని రాఘవేంద్రస్వామి ఆప్యాయంగా పలకరిస్తాడు.
సనాతన ధర్మాన్ని గురించి ఆయన దగ్గర శివాజీ ప్రస్తావిస్తాడు. వ్యతిరేక శక్తుల బారి నుంచి సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం శక్తికి మించిన భారం అవుతోందని అంటాడు. శివాజీ కారణజన్ముడనే విషయాన్ని ఆ సమయంలోనే రాఘవేంద్రస్వామి చెబుతాడు. భవానీదేవి అనుగ్రహం వలన ఆయనకి విజయాలు సొంతమవుతాయనీ, సనాతన ధర్మం ఆయన వలన ఉద్ధరించబడుతుందని అంటాడు.
అందువలన ఈ విషయంలో అసంతృప్తికి గురికాకుండా ఎప్పటిలా కర్తవ్య దీక్షలో కొనసాగమని చెబుతాడు. తనలో నూతన ఉత్సాహాన్ని ... ఉత్తేజాన్ని కలిగించిన రాఘవేంద్రస్వామికి కృతజ్ఞతలు తెలియజేసిన శివాజీ, చివరి నిముషం వరకూ ధర్మ రక్షణపై పోరాడతానని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు.