ఈ క్షేత్రంలో ఇది శాసనం !

సాధారణంగా ప్రాచీనకాలంనాటి క్షేత్రాలకు వెళ్లినప్పుడు అక్కడ శాసనాలు కనిపిస్తూ వుంటాయి. క్షేత్ర వైభవానికి సంబంధించినవి ... వివిధ కాలాల్లో రాజులు వేయించిన దాన శాసనాలు ... స్వామివారికి కానుకగా సమర్పించబడిన భూములు మొదలైనవాటి శాసనాలు ఎక్కువగా కనిపిస్తూ వుంటాయి.

ఒక్కమాటలో చెప్పాలంటే శాసనాలు ఆధ్యాత్మిక ... పౌరాణిక నేపథ్యాలను ఆవిష్కరించే తిరుగులేని ఆధారాలుగా దర్శనమిస్తూ వుంటాయి. కొన్ని శాసనాల్లో మాత్రం అక్కడి దైవం విషయంలో ఎలా నడచుకోవాలో కూడా చెప్పడం జరుగుతూ వుంటుంది. అలాంటి శాసనం శ్రీదేవి - భూదేవి సమేత శ్రీచెన్నకేశవస్వామి ఆలయంలో కనిపిస్తుంది.

విశిష్టమైనటువంటి ఈ క్షేత్రం మనకి ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో గల 'పమ్మి' గ్రామంలో దర్శనమిస్తుంది. ఖమ్మం జిల్లా పరిధిలో గల అత్యంత ప్రాచీనమైన ఆలయాల్లో ఇది ఒకటి. ఇక్కడి చెన్నకేశవస్వామి అనుగ్రహంతో విజయం సాధించిన రాజులు, ఆయనకి కొన్ని ఎకరాల భూమిని కానుకగా సమర్పిస్తూ దానశాసనం వేయించారు. ఈ శానంలోనే వాళ్లు చేసిన ఒక హెచ్చరిక కనిపిస్తుంది.

ఇక్కడి స్వామి మహిమాన్వితుడనీ, పొరపాటున కూడా ఆయనని ఎవరూ తక్కువచేసి మాట్లాడవద్దనీ ... అలా చేస్తే ఎలాంటి శిక్షను పొందవలసి వస్తుందో కూడా వాళ్లు ఆ శాసనం ద్వారా తెలియపరిచారు. ఈ రాజులిద్దరూ స్వామివారి అనుగ్రహాన్ని పొందిన కారణంగా ... ఆయన మహిమను ప్రత్యక్షంగా తెలుసుకున్నందు వలన ఈ శాసనాన్ని అందరూ గౌరవిస్తారు. ఈ శాసనంలో పేర్కొనబడిన విషయాన్ని కొట్టిపారేసిన వాళ్లు సైతం ఇబ్బందుల్లోపడిన సందర్భాలను గుర్తు చేస్తారు.

దైవనింద మహాపరాథమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ విషయంగా ఈ క్షేత్రంలో స్వామివారి పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించవలసి వుంటుంది. అందుకే ఇక్కడి స్వామి మహిమాన్వితుడని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు. ఆయన వైభవం ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటూ, అత్యంత భక్తిశ్రద్ధలతో సేవిస్తుంటారు.


More Bhakti News