అధర్మానికి ఫలితం అనుభవించక తప్పదు
శ్రీరాముడు మూర్తీభవించిన ధర్మ స్వరూపుడు. ధర్మానికి అండగా నిలుస్తూ ... అధర్మాన్ని అణచివేస్తూ ఆయన తన అవతార కార్యాన్ని కొనసాగించాడు. అందువలన ఆయన ఎవరికీ ఎక్కడా సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితి రాలేదు. సుగ్రీవుడి విషయంలో వాలి అధర్మంగా నడచుకున్నందు వలన, రాముడు సుగ్రీవుడికి అండగా నిలిచి వాలిని సంహరించాడు.
అలాగే పరస్త్రీని అపహరించిండం ... బంధించడం ధర్మంకాదనీ, సీతను అప్పగించి ప్రాణాలు దక్కించుకోమని రావణుడుకి రాముడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అయినా రావణుడు వినిపించుకోకపోవడం వలన ఆయన్ని అంతం చేశాడు. విషయం తెలుసుకున్న 'మండోదరి' కన్నీళ్ల పర్యంతమవుతూ అక్కడికి వస్తుంది.
తన భర్తను సంహరించిన శ్రీరాముడిని ఆమె నిందిస్తుందని అంతా అనుకుంటారు. కాని ఆమె రాముడిని ఒక్క మాట కూడా అనదు. మహాభక్తుడు ... మహాబల సంపన్నుడు అయిన రావణుడు ఒంటరివాడై యుద్ధభూమిలో నేలకొరగడానికి కారణం ఆయన అనుసరించిన అధర్మ మార్గామేనని మండోదరి అంటుంది. సీత విషయంలో రావణుడు అధర్మ మార్గాన్ని ఆశ్రయించాడనీ, అదే ఆయన మరణానికి కారణమైందని విలపిస్తుంది. లంకానగరంలోని ప్రజలనైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ధర్మబద్ధంగా వ్యవహరించిన విభీషణుడుకి ఆ నగరానికి రాజుగా రాముడు పట్టాభిషేకం చేశాడు.
అధర్మం ... అపజయాలను కలిగిస్తూ పతనం దిశగా పరుగులు తీయిస్తుంది. అందుకే కౌరవులు ఎన్ని విధాలుగా రెచ్చగొడుతూ వున్నా, చివరికి ధర్మమే జయిస్తుందనే విషయాన్ని చాటి చెప్పడం కోసం పాండవులు ధర్మమార్గాన్ని తప్పకుండా కృష్ణుడు చూసుకున్నాడు. సోదరుల విషయంలో అధర్మంగా వ్యవహరించిన కారణంగా దుర్యోధనుడితో పాటు కౌరవులంతా దాని ఫలితాన్ని అనుభవించవలసి వచ్చింది.