అందుకే ఈ క్షేత్రానికి ఈ పేరు వచ్చింది !
అత్యంత విశిష్టమైన ... అరుదైన ఆలయాలలో 'ర్యాలి' ఒకటిగా కనిపిస్తూ వుంటుంది. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. ఒకే సాలగ్రామ శిలపై ఒకవైపున జగన్మోహినీదేవి ... మరోవైపున కేశవస్వామి దర్శనమిస్తూ ఉండటం ఇక్కడి ప్రత్యేకత. సమ్మోహితులను చేసే ఈ ప్రతిమ స్వయంభువు కావడం మరో విశేషం.
ఇక్కడ స్వామివారు వెలుగు చూడటానికీ, ఈ క్షేత్రానికి ఈ పేరు రావడానికి సంబంధం వుంది. ఆసక్తిని కలిగించే ఆ విషయాన్ని గురించి తెలుసుకోవాలంటే కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్లవలసి వుంటుంది. 'విక్రమదేవుడు' అనే రాజు ఒకరోజున రథంపై వేటకి బయలుదేరుతాడు. వేట కారణంగా అలసిపోయి ఒకచెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాడు.
నిద్రలోకి జారుకున్న ఆయనకి స్వప్నంలో తేజోవంతమైన ఒక రూపం కనిపించి, అక్కడికి కొంతదూరంలో తన స్వయంభువుమూర్తి భూ గర్భంలో నిక్షిప్తమై ఉందనీ, దానిని వెలికి తీయమని చెబుతాడు. ఆ స్వయంభువు మూర్తి కోసం ఆలయాన్ని నిర్మించి పూజాభిషేకాలు జరిగేలా చూడమని ఆదేశిస్తాడు. ఆ ప్రదేశాన్ని గుర్తించే మార్గం చెప్పమని స్వప్నంలోనే అడుగుతాడు రాజు.
అక్కడి నుంచి రథాన్ని స్వేచ్ఛగా వదిలి ... దానిని అనుసరించమనీ, దాని 'శీల' ఎక్కడైతే రాలి పడిపోతుందో అక్కడ తవ్వి చూడమని చెబుతాడు. స్వామి ఆదేశాన్ని అక్షరాలా పాటించిన రాజుకి స్వయంభువు మూర్తి ప్రతిమ దర్శనమిస్తుంది. ఆ స్వయంభువు మూర్తి జాడను తెలుపుతూ, రథం 'శీల' .. 'రాలి' పడిపోయిన ప్రదేశం కనుక, ఈ క్షేత్రానికి 'ర్యాలి' అనే పేరు వచ్చినట్టుగా స్థలపురాణం చెబుతోంది. ఆధ్యాత్మిక నేపథ్యాన్ని ... చారిత్రక వైభవాన్ని కలిగివున్న ఈ అరుదైన క్షేత్రాన్ని చూసితీరవలసిందే.