ఆదిదంపతులు అనుగ్రహించే క్షేత్రం

శివపార్వతులు ... ప్రేమానురాగాలకు ప్రతీకలుగా కనిపిస్తూ వుంటారు. భార్యాభర్తల బంధానికి అద్దంపడుతూ వుంటారు. విగ్రహ రూపాల్లో ఒకే పీఠంపై కూర్చుని భక్తులకు దర్శనమిస్తూ వుంటారు. శివలింగరూపంలోనూ ఇద్దరూ కలిసి పూజాభిషేకాలు స్వీకరిస్తూ వుంటారు. ఎవరైనా దంపతులు అన్యోన్యంగా వుంటే ... అచ్చు ఆదిదంపతుల్లా వున్నారని అంటూ వుంటారు. అంతగా తమ దాంపత్యం కారణంగా కూడా అందరికీ వాళ్లు ఆదర్శప్రాయమై నిలిచారు.

అందువలన శివపార్వతుల ఆశీస్సులు తీసుకుంటే, వైవాహిక జీవితం ఎలాంటి ఒడిదుడుకులకు లోనుకాకుండా సాగిపోతుందని భక్తులు విశ్వసిస్తూ వుంటారు. ఈ కారణంగానే కొత్త దంపతులు శివపార్వతుల ఆలయాలను దర్శించుకుంటూ వుంటారు. ఇంకొందరు ఆదిదంపతులు కొలువుదీరిన ఆలయ ప్రాంగణంలో వివాహం చేసుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయని భావిస్తుంటారు.

అలా వివాహాలు ఎక్కువగా జరిగే శివపార్వతుల ఆలయాలలో ఒకటి 'మిర్యాలగూడ'లో కనిపిస్తుంది. నల్గొండ జిల్లా పరిధిలో గల ఈ క్షేత్రం ఎంతో విశిష్టమైనదిగా చెబుతుంటారు. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం, ప్రతి సోమవారంతో పాటు పర్వదినాలలోను ... శ్రావణ - కార్తిక మాసాల్లోను భక్తులతో సందడిగా కనిపిస్తూ వుంటుంది. ఇక్కడి ఆదిదంపతులను దర్శించడం వలన వాళ్ల ఆశీస్సులతో వివాహం యోగం కలగడమే కాకుండా, సంతాన సౌభాగ్యాలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తూ వుంటారు.

అందువల్లనే ఇక్కడ వివాహాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక శ్రావణ మంగళ వారాల్లోనూ ... కార్తిక మాసంలోను ... శివరాత్రి పర్వదినం సందర్భంగాను ప్రత్యేక పూజలు ... సేవలు నిర్వహిస్తుంటారు. భారీగా తలివచ్చే భక్తులు ఆదిదంపతులను పూజిస్తూ పునీతులవుతూ వుంటారు.


More Bhakti News