దీర్ఘాయువును ప్రసాదించే శివపూజ

అంకితభావంతో ఆదిదేవుడిని పూజించాలేగానీ, అనుగ్రహించడానికి ఆయన ఎంతమాత్రం ఆలస్యం చేయడనడానికి ఎన్నో నిదర్శనాలు వున్నాయి. తన భక్తులకు ఏది అవసరమో తెలుసుకుని అవసరమైనంతగా దానిని ప్రసాదించడం పరమశివుడి ప్రత్యేకత. అలా ఆయన తన భక్తులకు ఆరోగ్యాన్ని ... ఐశ్వర్యాన్ని ... మోక్షాన్ని అందిస్తూ వుంటాడు.

ఇక అసమానమైన భక్తితో సేవిస్తే, అకాలమృత్యు దోషాలను తొలగించి దీర్ఘాయుష్షును కూడా ప్రసాదిస్తాడు. అల్పాయుష్కుడైన మార్కండేయుడి భక్తికి మెచ్చి ఆయనను చిరంజీవిగా అనుగ్రహించిన విషయాన్ని ఇక్కడ గుర్తుచేసుకోవచ్చు. సాధారణంగా ఆరోగ్యంగా ఉండటానికీ ... ఐశ్వర్యవంతులు కావడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తుంటారు. కానీ ఆయుష్షు విషయానికి వచ్చేసరికి అది పూర్తిగా ఆ భగవంతుడి చేతిలోనే వుంటుంది. ఎంతటి స్థితిమంతులైనప్పటికీ క్షణకాలం పాటు ఆయుష్షును కూడా కొనలేరు. అలాంటి ఆయుష్షు భగవంతుడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం వల్లనే లభిస్తుంది.

అలా ఆయుష్షు విషయంలో ఆయన అనుగ్రహాన్ని పొందాలంటే, శివరాత్రి రోజున ఆ దేవదేవుడిని దర్భలతో పూజించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం రోజున శివుడి అనుగ్రహాన్ని పొందడానికి వివిధ రకాల ద్రవ్యాలతో ఆయనని పూజించడం జరుగుతుంటుంది. ఈ రోజున ఒక్కో విధమైన పూజా ద్రవ్యాన్ని ఉపయోగించడం వలన ఒక్కో ఫలితం వుంటుంది. ఈ నేపథ్యంలో దర్భలతో శివుడిని పూజించడం వలన, అపమృత్యు దోషం నశించి దీర్ఘాయుష్షు లభిస్తుందని చెప్పబడుతోంది.


More Bhakti News