స్వామికి చెప్పుకుంటే దొరుకుతాయట !
సాధారణంగా ఒక్కో పుణ్యక్షేత్రానికి ఒక్కో ప్రత్యేకత ఉంటూ వుంటుంది. ఒక క్షేత్రంలోని దైవాన్ని దర్శించడం వలన అనారోగ్యాలు తొలగిపోతుంటాయి. మరో క్షేత్రాన్ని దర్శించడం వలన ఆర్ధికపరమైన ఇబ్బందులు తొలగిపోతుంటాయి. ఇలా ఆయా క్షేత్రాలను దర్శించుకోవడం వలన విద్య .. ఉద్యోగం .. వివాహం .. సంతానం .. సౌభాగ్యం లభిస్తూ వుంటాయనే విషయాలను అక్కడి స్థలపురాణాలు చెబుతూ వుంటాయి.
ఈ నేపథ్యంలో తప్పిపోయిన మనుషులు ... పశువులు ... దొంగిలించబడిన వస్తువుల గురించి సమాచారాన్ని అందించే దేవుడు కూడా ఒక క్షేత్రంలో అలరారుతున్నాడు. ఆ క్షేత్రమే 'తమ్మర బండపాలెం' ... ఆ దేవుడే వేంకటేశ్వరుడు. నల్గొండ జిల్లా కోదాడ మండల పరిధిలో గల ఈ క్షేత్రం అత్యంత ప్రాచీనమైన క్షేత్రంగా చెప్పబడుతోంది.
ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ క్షేత్రం అనేక మహిమలకు నెలవుగా భక్తులు పేర్కొంటూ వుంటారు. తమ కుటుంబ సభ్యులు ఎక్కడైనా తప్పిపోయినా ... తమ పశువులు దారితప్పి ఎక్కడికైనా వెళ్లిపోయినా ... వాటిని ఎవరైనా బంధించినా ... తమ ఇంట్లో దొంగలు పడి తమ వస్తువులు అపహరించుకుపోయినా ఇక్కడి వాళ్లు వెంటనే స్వామికి చెప్పుకుంటారు.
తప్పిపోయినది మనుషులైనా ... పశువులైనా ఎక్కడ వున్నది స్వామివారు స్వప్నంలో కొన్ని సంకేతాల ద్వారా తెలియజేస్తాడట. ఇక దొంగిలించబడిన సొమ్ము కష్టార్జితమే అయితే, అది ఏదో విధంగా తిరిగి వచ్చేలా చేసిన సందర్భాలు ఎన్నో వున్నాయట. ఈ ప్రత్యేకత కారణంగా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. మహిమగల దేవుడికి మనసులోని మాటను చెప్పుకుంటూ వుంటారు.