రాఘవేంద్రుని మనసు కదిలించిన భక్తుడు

'శ్రావణ బహుళ విదియ' రోజున బృందావన ప్రవేశం చేయాలని రాఘవేంద్రస్వామి నిర్ణయించుకుంటాడు. ఆదోని నవాబు ఆదేశం మేరకు అక్కడ 'దివాను'గా వున్న వెంకన్న అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తుంటాడు. తాను ఆ స్థానానికి రావడానికి కారకుడైన రాఘవేంద్రస్వామి అంటే ఆయనకి ప్రాణం. స్వామి తనకి ... తన లాంటి భక్తులకు దూరమైపోతున్నందుకు బాధపడుతూనే ఆయన దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తూ వుంటాడు.

ఆయన ఆవేదనను గ్రహించిన స్వామి, తాను బృందావన ప్రవేశం చేసినా ... భక్తులు పిలిచినదే తడవుగా పలుకుతానని చెబుతాడు. దాంతో వెంకన్న మనసు కాస్త కుదుటపడుతుంది. బృందావన ప్రవేశానికి స్వామి వారు తన శిష్యులతో కలిసి బయలుదేరుతాడు. ఆయనని ఆరాధించే వాళ్లంతా భారమైన మనసుతో అనుసరిస్తూ వుంటారు.

అదే సమయంలో రెండు కాళ్లూ పడిపోయిన ఒక వ్యక్తి చేతుల సాయంతో పాకుతూ అక్కడికి వస్తూ వుండటం స్వామి చూస్తాడు. ఆతృతగా అతని దగ్గరికి వెళతాడు. తనని చూడటం కోసం చాలాదూరం నుంచి అలా వస్తున్నాడని తెలుసుకుంటాడు. మోకాళ్లు ... అరచేతులు కొట్టుకుపోయి రక్తం వస్తూ వుండటం చూస్తాడు. స్వామిని చూడకపోతే తాను పడే బాధకన్నా ... గాయాల కారణంగా తాను పడే బాధ చాలా చిన్నదని చెబుతాడు ఆ వ్యక్తి.

ఆ మాటకి స్వామి చలించిపోతాడు ... తన చేతులతో ఆప్యాయంగా అతనిని పైకి లేవనెత్తుతాడు. నిదానంగా లేచి నిలబడిన ఆ వ్యక్తి, తన కాళ్లు పనిచేస్తుండటాన్ని గమనించి ఆశ్చర్యపోతాడు. స్వామి మహిమలు అక్కడున్నవారికి కొత్తకాకపోయినా, ఆ సందర్భం వారి మనసును కదిలిస్తుంది. ఎలుగెత్తి వాళ్లు రాఘవేంద్రస్వామి నామాన్ని స్మరిస్తారు. చచ్చుబడిపోయిన కాళ్లలో తిరిగి శక్తిని పొందిన ఆ వ్యక్తి స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుని, అందరితో కలిసి స్వామివారిని అనుసరిస్తాడు.


More Bhakti News