కొండపై వెలసిన కోదండరాముడు
కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక రాత్రివేళ ఆకాశం నుంచి ఒక మెరుపుతీగ ఒక కొండ పై భాగాన్ని తాకిందట. దూరం నుంచి ఈ దృశ్యం చూసిన వాళ్లు పిడుగు పడిందని అనుకున్నారు. అయితే ఆ కాంతి కిరణం ఒక పురుషుడి ఆకారాన్ని సంతరించుకుని అంతలోనే మాయమై పోయింది.
ఆ మరునాడు ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తనకి కలలో రాముడు కనిపించి తాను ఆ కొండపై వెలిసినట్టు చెప్పాడని మిగతా వాళ్లతో అంటాడు. రాత్రి ఆ కొండపై తాము ఒక దివ్యమైన వెలుగు చూసినట్టుగా కొంతమంది అక్కడి వాళ్లతో చెబుతారు. అసలు అక్కడ ఏవుందో తెలుసుకోవాలనే ఆసక్తితో అంతా కలిసి ఆ కొండపైకి వెళతారు.
అక్కడ రాళ్ల మధ్యలో సీతారాముల రూపాలు వెలసి వుండటం చూసి ఆశ్చర్యపోతారు. రాత్రి తాము చూసిన దృశ్యానికి ... ఆ గ్రామస్తుడికి కలలో రాముడి చెప్పిన దానికి నిదర్శనంగా అక్కడ సీతారాములు కొండరాయిపై దర్శనమివ్వడంతో అంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. అలా సీతారాములు ఆవిర్భవించిన ఆ కొండ 'కవాడపల్లి' గ్రామంలోనిది. హైదరాబాద్ - హయత్ నగర్ మండలం పరిధిలో ఈ గ్రామం కనిపిస్తుంది.
సీతారాములు రాళ్ల మధ్యలో ఆవిర్భవించడం వలన, భక్తులు దర్శించుకోవడానికి వీలుగా ఆలయాన్ని నిర్మించి, సీతారాములతో పాటు లక్ష్మణ - హనుమ విగ్రహాలనులను కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. సీతారాములపై ఆదిశేషుడు గొడుగులా పడగా విప్పినట్టుగా వెలసిన ముద్ర ఉంటుందని అర్చకులు చెబుతుంటారు. అందుకు నిదర్శనంగా ఒక సర్పం అక్కడ సంచరిస్తూ తరచూ కనిపిస్తూ ఉంటుందని అంటారు.
ఇక్కడి స్వామిని దర్శించుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయని చెబుతుంటారు. కాలక్రమంలో ఇక్కడి ప్రాంగణంలో వినాయక స్వామికి ... సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక ఆలయాలను, విఖనస మహామునికి మందిరాన్ని నిర్మించారు. ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణ మహోత్సవం ఇక్కడ ఘనంగా జరుగుతూ వుంటుంది. ఈ సందర్భంగా అత్యధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు ... సీతారాములను సేవించుకుని తరిస్తుంటారు.