విజయాన్ని ప్రసాదించే దేవుడు

ప్రాచీనకాలంనాటి చెన్నకేశవస్వామి క్షేత్రాలను పరిశీలిస్తే ... ఆయనని ఎక్కువగా రాజులు సేవించినట్టు తెలుస్తూ వుంటుంది. రాజులు యుద్ధానికి బయలుదేరుతూ ఈ స్వామిని పూజించి, విజయాన్ని ప్రసాదించమని కోరుకుని ఆయన ఆశీస్సులు తీసుకుంటూ వుండేవారు. యుద్ధంలో విజయం వరిస్తే కృతజ్ఞతా పూర్వకంగా స్వామి వారికి భారీగా కానుకలు సమర్పించుకునేవారు.

అలా విజయాలను ప్రసాదించే చెన్నకేశవస్వామి క్షేత్రాలలో 'పమ్మి'ఒకటిగా కనిపిస్తూ వుంటుంది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో విలసిల్లుతోన్న ఈ క్షేత్రంలో శ్రీదేవి - భూదేవి సమేతంగా చెన్నకేశవస్వామి దర్శనమిస్తూ వుంటాడు. ఇక్కడి స్వామివారు క్రీ.శ.1236 వ సంవత్సరంలో వెలుగులోకి వచ్చాడంటే ఆయన ఎంత ప్రాచీనకాలంనాటివాడో అర్థం చేసుకోవచ్చు.

నెల్లూరు ప్రాంతానికి చెందిన నాగసాయన్న ... బొమ్మారెడ్డి అనే రాజులు ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేసినట్టుగా శాసనాలు చెబుతున్నాయి. కాకతీయులను ఎదిరించడానికి వెళుతూ వాళ్లు ఇక్కడి స్వామిని దర్శించుకున్నారట. తమ ప్రయత్నం ఫలిస్తే నిత్యార్చన నిమిత్తం 50 ఎకరాల భూమిని శాశ్వతంగా రాసి ఇస్తామని మొక్కుకున్నారట. వెళ్లిన పని విజయవంతం కావడంతో వాళ్లు స్వామికి ఆ మొక్కు చెల్లించుకుని ... దానిని శాసనంగా వేయించారు.

ఈ స్వామిని అంకిత భావంతో అడగాలే గాని కాదనకుండా అనుగ్రహిస్తాడట. ముఖ్యంగా ఈ స్వామిని దర్శించుకుని వెళ్లిన వారిని విజయం తప్పక వరిస్తుందని అంటారు. అయితే ఈ స్వామిని పొరపాటున కూడా కించపరుస్తూ మాట్లాడకూడదనీ, కాదని అలా చేసినవారు వెంటనే తగిన ఫలితాన్ని అనుభవించిన నిదర్శనాలు వున్నాయని ఇక్కడివారు చెబుతుంటారు.

స్వామివారు 'రేవతి' నక్షత్రం రోజున వెలుగు చూసిన కారణంగా ప్రతి నెలా రేవతి నక్షత్రం రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఇక ప్రతి సంవత్సరం 'ఫాల్గుణ పౌర్ణమి' రోజున స్వామివారి కల్యాణం ఘనంగా జరుపుతుంటారు. వివిధ ప్రదేశాల్లో ... విదేశాల్లో స్థిరపడిన గ్రామస్తులు కొందరు స్వామివారి కల్యాణానికి తప్పక హాజరవుతూ వుండటం విశేషం.


More Bhakti News