శని దోష నివారణకు ఒక మార్గం !
శని దేవుడి చూపుకి అందకుండా ... ఆయన చేతికి చిక్కకుండా తప్పించుకోవడం అసాధ్యమనే చెప్పాలి. దేవతలు మొదలుకుని ఎంతోమంది అందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. శని బారి నుంచి బయటపడాలంటే ... అయన అనుగ్రహాన్ని పొందడం తప్ప మరో మార్గం లేదని గ్రహించారు. అలాంటి వాళ్లందరూ శనిదేవుడి మనసు గెలుచుకుని ఆయన ప్రభావం నుంచి బయటపడిన సందర్భాలు ఎన్నో కనిపిస్తూ వుంటాయి.
అందుకే శని దోషంతో బాధలు పడుతున్న వాళ్లు ఆయన క్షేత్రాలను వెదుక్కుంటూ వెళ్లి పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఆయనని శాంతింపజేసి ఆయన ప్రభావం నుంచి బయటపడటానికి తమవంతు ప్రయత్నం చేస్తుంటారు. శనిదేవుడిని శాంతింపజేయాలంటే ఆయనకి ఇష్టమైన విధంగా నడచుకోవలసి వుంటుంది. అంటే పుణ్యకార్యాల్లో ఎక్కువగా పాల్గొనవలసి వుంటుంది.
అలాగే ఆయనకి ఇష్టమైన వర్ణంలో గల పూలతో పూజించాలి. అంతే కాకుండా ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించవలసి ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. శని దేవుడికి నీలం రంగు అంటే ఇష్టం ... అందువలన ఈ వర్ణంలో గల పూలతో ఆయనని పూజించాలి ... ఇదే రంగు వర్ణం గల వస్త్రాలను సంతోషంగా సమర్పించాలి. ఇక నువ్వుల పిండితో చేసిన వంటకాలను ... పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి.
అంతే కాకుండా శనిదోషం గల వారు ప్రతినిత్యం ''నీలాంబరో నీల వపుః కిరీటీ ... గృధ్ర స్థిత స్త్రాసకరో ధనుష్మాన్ ! చతుర్భుజ స్సూర్యసుతః ప్రశాంతః ... సదాస్తు మహ్యం వరదః ప్రసన్నః !! '' అంటూ ఆయనని స్తుతించాలి. ఇలా స్వామిని సంతోష పెట్టడం వలన ఆయన మనసు కరిగి అనుగ్రహం లభిస్తుందనీ, ఫలితంగా శనిదోషం తొలగిపోతుందని చెప్పబడుతోంది.