రాఘవేంద్రస్వామి ఆరాధనా ఫలితం !
రాఘవేంద్రస్వామి అనగానే పవిత్రత .. ప్రశాంతత .. దివ్యమైన తేజస్సు కలిగిన ఆకర్షణీయమైన రూపం కనులముందు కదలాడుతుంది. అప్రయత్నంగానే ఆయన పాదాలకు శిరసు వంచి నమస్కరించాలనిపిస్తుంది. మంత్రాలయంలో కొలువైన ఆ గురుదైవాన్ని మనసారా దర్శించుకోవాలనిపిస్తుంది. అలాంటి రాఘవేంద్రస్వామి 'శ్రావణ బహుళ విదియ' రోజున సజీవ సమాధిలోకి ప్రవేశించాడు. ఈ సందర్భంగా ఈ రోజున ఆయన ఆరాధనోత్సవాలు నిర్వహిస్తుంటారు.
ఈ సందర్భంగా ఆయన కొలువుదీరిన ఆలయాలలో భక్తుల సందడి ఎక్కువగా కనిపిస్తూ వుంటుంది. దైవం యొక్క ఆదేశం మేరకు సంసార సంబంధమైన వ్యామోహాన్ని వదిలి, ఆశ్రమ ధర్మాన్ని ఆయన స్వీకరించిన తీరు ఆశ్చర్యచకితులను చేస్తుంది. తన గురుదేవులు తనకి అప్పగించిన మూలరాముడి సేవలో ఆయన ఎంత శ్రద్ధను కనబరిచాడో, తనను నమ్మిన భక్తులను కాపాడటంలోను ఆయన అంతే శ్రద్ధను పాటిస్తూ వచ్చాడు.
ఈ నేపథ్యంలోనే ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ప్రభావితం చేస్తోన్న ఓ గురువుగా ఆయన శక్తి సామర్థ్యాలను పరీక్షించడానికి ఎంతోమంది ప్రయత్నించారు. తన చేతల ద్వారానే ఆయన వాటికి తగిన సమాధానాన్ని చూపిస్తూ వచ్చాడు. ఆ సంఘటనలే మహిమలుగా వెలుగు చూశాయి. వీణా వాదనతో ... గ్రంధ రచనలతో ఆధ్యాత్మిక వైభవానికి కృషి చేసిన రాఘవేంద్రస్వామి, అనేక ప్రదేశాలను దర్శిస్తూ తన పాద స్పర్శ వలన ఆ ప్రదేశాలను మరింత పవిత్రం చేశాడు.
తన పూర్వ జన్మల గురించే కాకుండా .. భవిష్యత్తులో తన ప్రభావం ఎంతకాలం పాటు వెలుగొందుతుందో కూడా తెలియజెప్పాడు. మంచాల గ్రామంతో తనకి గల అనుబంధాన్ని గురించి శిష్యులకు వివరించి, అక్కడే కొలువుదీరి తన భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఆ స్వామిని ఆరాధించడం వలన దుష్ట ప్రయోగాలు .. గ్రహసంబంధమైన దోషాలు .. అనారోగ్యాలు .. ఆపదలు తొలగిపోతాయి. ఆ స్వామిని నమ్మిన వారికి సకల శుభాలు చేకూరతాయి. ఈ కారణంగానే ఆయన భక్తులు శ్రావణ బహుళ విదియ సందర్భంగా జరిగే రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాళ్లో పెద్ద సంఖ్యలో పాల్గొంటూ వుంటారు.