శత్రుహాని లేకుండా చేసే అభిషేకం
సదాశివుడి అనుగ్రహాన్ని పొందడానికి భక్తులు ఎంతగా ఆరాటపడుతూ వుంటారో, ఆ భక్తుల కోరికలను నెరవేర్చడానికి ఆయన కూడా అంతగానే ఆత్రుతపడుతుంటాడు. అవసరాల్లోను ... ఆపదల్లోను వాళ్లకి అండగా నిలుస్తుంటాడు. అలాంటి పరమశివుడిని ఒక్కో అభిషేక ద్రవ్యంతో అభిషేకించడం వలన ఒక్కో విశేషమైన ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందువలన భక్తులు వివిధ రకాల అభిషేక ద్రవ్యాలతో ఆదిదేవుడిని అభిషేకిస్తూ ఆయన అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తుంటారు.
ఈ నేపథ్యంలో 'కస్తూరీ జలం'తో అభిషేకం చేయడం వలన శత్రువుల వలన హాని లేకుండా పోతుందని చెప్పబడుతోంది. సాధారణంగా ఏదైనా ఒక విషయంలో ఇతరులతో గొడవలు జరిగినప్పుడు అవతల వాళ్లు శత్రువులుగా మారుతుంటారు. ఇక ఎలాంటి గొడవలూ లేకపోయినా, అసూయ కారణంగా కొంతమంది శత్రువులు పుట్టుకొస్తుంటారు.
దూరంగా వుంటూనే సమయం వచ్చినప్పుడు దెబ్బకొట్టాలని కొంతమంది శత్రువులు ఎదురుచూస్తుంటారు. ఇక మంచితనాన్ని నటిస్తూ అవకాశం కోసం ఎదురుచూసే శత్రువులు కొందరుంటారు. తమకి ఎవరు శత్రువులు ? ... తమ ఎదుగుదలను అడ్డుకోవడానికి వాళ్లు ఏం చేయబోతున్నారు ? అనే విషయం చాలామంది ముందుగా పసిగట్టలేకపోతుంటారు.
కస్తూరి జలంతో శివుడిని అభిషేకించడం వలన కలిగే ఫలితం, అలాంటి శత్రువుల బారిన పడకుండా కాపాడుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. దెబ్బతీయడానికి శత్రువులు ఎలాంటి పథక రచన చేసినా, ఈ అభిషేక ఫలితం వాటిని అడ్డుకుంటుంది. శత్రువుల వలన ఎలాంటి హాని జరగకుండా చూస్తుంటుంది. అందువలన శత్రు హాని వున్న వాళ్లు కస్తూరీ జలాలతో శివుడికి అభిషేకం చేస్తూ వుండాలి ... ఆయన అనుగ్రహాన్ని పొందుతూ వుండాలి.