నిరంతరం దైవనామాన్ని స్మరించాలి
ఆధ్యాత్మిక చింతన కలిగిన వాళ్లందరూ, భగవంతుడే సర్వానికి యజమాని అని విశ్వసిస్తారు. ఏ విషయంలోనైనా ... ఏ వేళలోనైనా తమని కాపాడేది ఆ భగవంతుడేనని నమ్ముతూ వుంటారు. తమ పనులు చేసుకుంటూ వుంటూనే భగవంతుడిని తలచుకోవడం ... ఆయన నామాన్ని స్మరించడం చేస్తుంటారు. 'జపం' చేసుకోవడానికైతే కొన్ని నియమాలను పాటించాలి కానీ, దైవ నామస్మరణ ఎక్కడైనా ... ఎప్పుడైనా చేసుకోవచ్చు.
దైవ నామ స్మరణ వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని శాస్త్రం చెబుతోంది. లక్ష్మీనారాయణుల విషయానికే వస్తే, లక్ష్మీదేవి నామాన్ని మనసులో స్మరిస్తూ వుండే వారిని ఆ తల్లి అనుగ్రహిస్తుంది. అనారోగ్యాలను ... ఆర్ధికపరమైన ఇబ్బందులను వాళ్ల నుంచి దూరం చేస్తుంది. మహాలక్ష్మిగా సంపదలను ... విజయలక్ష్మిగా విజయాలను ... మోక్షలక్ష్మిగా మోక్షాన్ని సైతం ప్రసాదిస్తుంది.
ఇలా లక్ష్మీదేవి అన్ని రకాలుగా తన నామాన్ని స్మరించే వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే నిరంతరం హరినామాన్ని స్మరించడం వలన అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయని చెప్పబడుతోంది. హరినామాన్ని స్మరిస్తూ ఆనందాన్ని పొందాలి ... అనుభూతి చెందాలి. అంతలా ఆయన రూపాన్ని తలచుకుంటూ నామాన్ని స్మరించాలి. ఆయన లీలా విశేషాలను గుర్తుచేసుకుని ఆ పరవశంతో స్మరించాలి.
అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు సంతోషిస్తాడు. సమస్త పాపాల నుంచి విముక్తులను చేస్తూ విష్ణులోక ప్రాప్తిని కలిగిస్తాడు. కలియుగంలో నామస్మరణకి అంతటి శక్తి వుంది. అందుకే ఉదయాన్నే పూజ చేసుకుని దైవానికి కేటాయించిన సమయం అయిపోయిందనుకోకుండా, ఎల్లవేళలా దైవాన్ని స్మరిస్తూ వుండాలి ... ఆయన సేవలో తరిస్తూ వుండాలి.