అడిగిన వరాలనిచ్చే అమ్మవారు
ప్రతి గ్రామంలోను ఒక గ్రామదేవత కనిపిస్తూ వుంటుంది. ఆ గ్రామదేవతను అక్కడి ప్రజలు సాక్షాత్తు ఆదిపరాశక్తి స్వరూపంగా భావిస్తుంటారు. అమ్మవారే తమని రక్షించడం కోసం అలా గ్రామదేవతగా ఆవిర్భవించిందని విశ్వసిస్తూ వుంటారు. అలా 'వాడపల్లి' గ్రామంలో వెలసిన 'అంకాళమ్మ' గ్రామదేవతగా ఇక్కడ పూజాభిషేకాలు అందుకుంటూ వుంటుంది. నల్గొండ జిల్లా పరిధిలో గల విశిష్టమైన క్షేత్రాలలో ఇది ఒకటిగా కనిపిస్తూ వుంటుంది.
ఇక్కడ అమ్మవారు అగస్తేశ్వరుడి కాలం నుంచి వుందని చెబుతుంటారు. అగస్త్యమహర్షి ఈ ప్రదేశంలో తపస్సు చేసి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఈ కారణంగా ఇక్కడి స్వామి అగస్తేశ్వరుడుగా పూజలు అందుకుంటూ వుంటాడు. అప్పటి నుంచి ఇక్కడ అంకాళమ్మ వుందని చెబుతుంటారు. అప్పట్లో మహర్షులు ... సిద్ధులు పూజించిన అమ్మవారి ప్రతిమ ... కాలక్రమంలో అంతర్హితమైపోయింది.
అలా చాలాకాలం గడచిపోయింది ... అప్పట్లో అడవీ ప్రాంతంగా ఉండటం వలన జనసంచారం చాలా తక్కువగా ఉండేది. ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఆకలి తీర్చుకోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తే అమ్మవారు వృద్ధురాలిగా వచ్చి నిప్పుని ఇచ్చి వెళుతూ ఉండేదట. ఈ విషయం ఆ నోట ఈనోటా పడటం వలన ... ఆ వృద్ధురాలు ఎవరో తెలుసుకోవడానికి కొంతమంది ప్రయత్నించడం వలన అమ్మవారి మూర్తి తిరిగి వెలుగు చూసింది.
అప్పటి నుంచి ఇక్కడి అమ్మవారు పూజలు అందుకుంటోంది. ఆ తరువాత గ్రామం పెరుగుతూ రావడం వలన, ఇక్కడి అమ్మవారిని గ్రామదేవతగా ఆరాధించడం మొదలైంది. కాలక్రమంలో అమ్మవారి మహిమలు వెలుగులోకి వస్తూ ఉండటంతో ఆలయం అభివృద్ధి చెందుతూ వచ్చింది. మహర్షులచే పూజలందుకున్న మహిమగల తల్లిగా ఇక్కడి ప్రజలు అమ్మవారిని సేవిస్తూ వుంటారు. ఆ తల్లి అనుగ్రహం సంతాన సౌభాగ్యాలను ... సిరిసంపదలను ఇస్తుందని బలంగా విశ్వసిస్తూ వుంటారు. తమ గ్రామాన్ని ఆ తల్లి అనుక్షణం రక్షిస్తూ ఉంటుందని నమ్ముతుంటారు.
పర్వదినాలలోను ... శుభకార్యాల సమయంలోను ముందుగా ఆ తల్లిని దర్శించుకోవడం ఇక్కడి ఆనవాయతీగా కనిపిస్తూ వుంటుంది. ప్రతి సంవత్సరం 'శ్రావణ శుద్ధ సప్తమి' రోజున ఇక్కడ జాతర నిర్వహిస్తూ వుంటారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఆ తల్లి దర్శనం చేసుకుని మనసులోని మాటను చెప్పుకుని ... కానుకలు సమర్పించి వెళుతూ వుంటారు.