గర్భాలయంలోకి వచ్చిన రామచిలుక !
ప్రాచీనకాలం నాటి దేవాలయాలను దర్శిస్తున్నప్పుడు ... ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని క్షేత్రాలకు వెళ్లినప్పుడు అక్కడి ఆలయంపై పావురాలు ... చిలుకలు ... గోరింకలు వంటి పక్షులు కనిపిస్తూ వుంటాయి. అవి గోపురం ... మంటపం ... రథశాల వంటి ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటూ వుంటాయి.
ఇలాంటి పక్షులు గుడిలోకి .. అందునా గర్భాలయంలోకి రావడం చాలా అరుదుగా జరుగుతూ వుంటుంది. అలా జరిగితే అది భక్తులకు ఆశ్చర్యాన్ని మాత్రమే కలిగిస్తుంది. ఇక ఒకానొక ఉత్సవం సందర్భంగా అలా గర్భాలయంలోకి వచ్చిన పక్షి ఆ ఉత్సవం పూర్తయినదాకా అక్కడే వుండి వెళ్లడం మాత్రం భగవంతుడి లీలగానే భక్తులు విశ్వసిస్తుంటారు.
ఈ విశేషం నల్గొండ జిల్లా తమ్మరబండపాలెంలోని వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జరిగింది. గరుడవాహన ధారియైన ఇక్కడి వేంకటేశ్వర స్వామికి కొంతకాలం క్రితం ఉత్సవాలు నిర్వహించారు. మూడురోజుల పాటు ఈ ఉత్సవాలు జరిగాయి. స్వామివారికి సహస్ర కలశాభిషేకం జరుగుతూ వుండగా, ఎక్కడి నుంచో ఒక రామచిలుక గర్భాలయంలోకి ప్రవేశించింది.
ఆరోగ్యంగా వున్న ఆ చిలుక ఏ మాత్రం బెదరకుండా గర్భాలయంలోనే వుంది. మూడోరోజున ఉత్సవాలకు ముగింపు పలుకుతుండగా, ఈ రామచులుక ఆ పక్కనే వున్న 'రాజ్యలక్ష్మీదేవి' ఆలయంలోకి ఎగురుతూ వెళ్లి ఆ తల్లి చేతిపై వాలింది. అద్భుతమైన ఈ దృశ్యం చూసిన భక్తులు పరవశించిపోయారు. భక్తుల సందడిని ఎంతమాత్రం పట్టించుకోకుండా ఆ చిలుక అమ్మవారి వైపు మాత్రమే చూస్తూ వుండటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఆ రాత్రి ఆలయం తలుపులు మూసే వరకూ అమ్మవారి సన్నిధిలోనే వున్న రామచిలుక, మరునాడు ఉదయానికి అక్కడ కనిపించలేదు. మహిమాన్వితమైన ఈ సంఘటన గురించి ఇక్కడ ఆసక్తికరంగా చెప్పుకుంటూ వుంటారు. స్వామివారు ... అమ్మవార్లు ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై వున్నారని భావించి మరింత అంకిత భావంతో ఆరాధిస్తూ వుంటారు.