హయగ్రీవస్వామి ఆరాధనా ఫలితం !

శ్రావణ శుద్ధ పౌర్ణమి ... 'హయగ్రీవ జయంతి'గా చెప్పబడుతోంది. గుర్రం శిరస్సు భాగాన్ని కలిగివాడిగా కనిపించే ఈ దేవతామూర్తి సాక్షాత్తు శ్రీమహావిష్ణువే. లోక కల్యాణం కోసం శ్రీమహా విష్ణువు ధరించిన అవతారాల్లో హయగ్రీవ అవతారం ఒకటిగా చెప్పబడుతోంది. హిరణ్య కశిపుడిని సంహరించడానికి నరసింహస్వామి అవతారమెత్తిన నారాయణుడు, ఇక్కడ కూడా అసురసంహారం కోసమే హయగ్రీవుడుగా అవతరించాడు.

పూర్వం హయగ్రీవుడు అనే రాక్షసుడు, తన రూపంలో వున్నవారి చేతిలోనే తప్ప మరెవరి చేతిలో మరణం లేకుండా బ్రహ్మ నుంచి వరాన్ని పొందుతాడు. ఆ వరగర్వంతో అటు దేవతలను ... ఇటు సాధు సత్పురుషులను నానారకాలుగా హింసించడమే కాకుండా వేదాలను సైతం దొంగిలిస్తాడు. దాంతో దేవతలంతా కలిసి వైకుంఠానికి చేరుకొని, అక్కడే హయగ్రీవోత్పత్తి జరిగేలా చేస్తారు.

గుర్రం శిరస్సును పొందిన నారాయణుడుకి సమస్త దేవతలు తమ జ్ఞాన శక్తిని ధారపోస్తారు. దాంతో హయగ్రీవుడనే అసురుడిని సంహరించిన స్వామి వేదాలను కాపాడతాడు. అసుర సంహారం అనంతరం స్వామివారిని లక్ష్మీదేవి శాంతింపజేస్తుంది. నారాయణుడు ... హయగ్రీవుడిగా అవతరించిన ఈ రోజున ఎవరైతే లక్ష్మీ సమేతుడైన హయగ్రీవుడిని ఆరాధిస్తారో, వాళ్లకి జ్ఞానసిద్ధి కలిగి విద్యయందు రాణిస్తారనీ ... విజయంతో పాటుగా సంపదలను పొందుతారని సాక్షాత్తు జగజ్జనని అయిన పార్వతీదేవి పలుకుతుంది.

ఆ రోజు నుంచి హయగ్రీవుడు జ్ఞానాన్ని ప్రసాదించే దైవంగా పూజాభిషేకాలను అందుకుంటున్నాడు. అందువలన విద్యార్థులు తప్పనిసరిగా హయగ్రీవస్వామిని ఆరాధిస్తూ వుండాలి. ఆయన అనుగ్రహంతో అభివృద్ధిని సాధిస్తూ వుండాలి.


More Bhakti News