ఆ విషయం చెప్పిన సాధువు ఎవరో !

లక్ష్మీనరసింహస్వామి ఆవిర్భవించిన అత్యంత విశిష్టమైన క్షేత్రాల్లో ఒకటిగా 'ఉర్లుగొండ' క్షేత్రం దర్శనమిస్తూ వుంటుంది. నల్గొండ జిల్లాలో గల ఈ క్షేత్రం అనేక విశేషాలకు ... మహిమాన్వితమైన సంఘటనలకు నెలవుగా కనిపిస్తూ వుంటుంది. ఒకసారి ఈ క్షేత్రంలో ఒక చిత్రమైన సంఘటన జరిగినట్టుగా చెబుతుంటారు.

చాలాకాలం క్రితం ఈ ప్రాంతంలో తీవ్రమైన కరవుకాటకాలు ఏర్పడ్డాయట. అలా కరవు బారినపడిన ఉర్లుగొండ గ్రామస్తులకు ఏం చేయాలో పాలుపోలేదు. తమని ఆ లక్ష్మీనరసింహుడే కాపాడాలని భారం ఆయనపై వేస్తారు. ప్రతిరోజు స్వామివారి ఆలయానికి వచ్చి నమస్కరించుకుని, తమని కరవుకోరల్లో నుంచి బయటపడేయమని ప్రార్ధించి వెళుతూ వుండేవాళ్లు.

అలాంటి పరిస్థితుల్లోనే ఆ కొండపైకి ఎక్కడి నుంచో ఒక సాధువు వచ్చాడట. త్వరలోనే భారీ వర్షం పడుతుందనీ ... అందరి కరవుకాటకాలు తీరిపోతాయని ఆయన గ్రామస్తులకు చెబుతూ ఉండేవాడు. ఆయన మాటలు వాళ్లకు ఆశను ... ఆనందాన్ని కలిగించేవి. దాంతో స్వామితో పాటుగా ఆ సాధువుకు కూడా నమస్కరించి వెళుతూ వుండటం వాళ్లకి అలవాటుగా మారిపోయింది.

అలా కొన్ని రోజులు గడిచినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. దాంతో వాళ్లు తమ నిరాశా నిస్పృహలను ఆ సాధువు దగ్గర వ్యక్తం చేస్తారు. వాళ్ల నిరీక్షణ ఫలించే సమయం ఆసన్నమైందని ఆయన చెబుతాడు. అయినా అపనమ్మకంగానే వాళ్లు వెనుదిరుగుతారు. తాము అనుకుంటున్నట్టు ఆ సాధువుకి ఎలాంటి శక్తులు లేవనీ, ఆయన చెబుతున్నదంతా అబద్ధమని అనుకుంటారు. ఇక నుంచి ఆయన దగ్గరికి వెళ్ల కూడదని నిర్ణయించుకుంటారు.

అలా వాళ్లు అనుకున్న రోజు అర్థరాత్రి నుంచే ఎడతెరిపి లేకుండా వాన కురవడం మొదలవుతుంది. బావులు ... చెరువులు ... ఇతర జలాశయాలు నిండెంత వరకూ ఆ వాన అలా రెండు మూడు రోజులల పాటు కురిసిందట. వాన వెలిశాక గ్రామస్తులంతా కలిసి ఆ సాధువును గురించి తప్పుగా అనుకున్నందుకు బాధపడతారు. ఆయనని కలిసి కృతజ్ఞతలు చెప్పుకుని వద్దామని అక్కడికి వెళతారు.

అక్కడ ఆయన లేకపోవడం చూసి ఆలోచనలో పడతారు. ఆయన కోసం వెదికినా ప్రయోజనం లేకపోతుంది. ఆయన మాటని నమ్మలేకపోయినందుకు మన్నించమంటూ లక్ష్మీ నరసింహుడినే కోరుకుని అంతా వెనుదిరిగారట. చాలాకాలం క్రితం జరిగిన ఈ సంఘటన గురించి ఇప్పటికీ ఇక్కడ చెప్పుకుంటూనే వుంటారు.


More Bhakti News