తల్లిదండ్రుల సేవ అంతగొప్పది
జీవితం గాలిబుడగ వంటిదని భావించిన పుండరీకుడు, ఉన్నంతకాలం అన్నిరకాల సుఖాలను అనుభవించడమే సరైన మార్గమని అనుకుంటాడు. తన ఆనందం ... తన సంతోషం గురించి మాత్రమే ఆలోచిస్తూ, ఇష్టానుసారంగా ప్రవర్తించసాగాడు. స్వేచ్ఛ పేరుతో కట్టుబాట్లను ఉల్లంఘించి, పాండురంగస్వామి భక్తులు ... సదాచార సంపన్నులు అయిన తల్లిదండ్రులను ఎంతగానో బాధపెడతాడు. ఆ తరువాత జరిగిన కొన్ని అనూహ్యమైన సంఘటనల కారణంగా పుండరీకుడికి జ్ఞానోదయం అవుతుంది.
పువ్వు వికసించి వాడిపోయేలోగా పరిమళాన్ని పంచుతుంది ... భగవంతుడి సన్నిధిలో తరిస్తుంది. అలాగే తాను తల్లిదండ్రుల సేవలో తరించాలని అనుకుంటాడు. తల్లిదండ్రులను సేవిస్తే, పరమాత్ముడిని సేవించినట్టేనని భావించి అందుకోసమే పూర్తి సమయాన్ని కేటాయిస్తాడు. ఒకసారి పుండరీకుడు తండ్రి పాద సేవచేస్తూ ... పాండురంగడిని తలచుకుంటాడు. తల్లిదండ్రుల సేవ పట్ల ఆయనకి గల శ్రద్ధను పరీక్షించాలనుకున్న పాండురంగడు వెంటనే ఆయన గుమ్మం ముందు ప్రత్యక్షమవుతాడు.
తను వచ్చినట్టు చెప్పి పుండరీకుడిని బయటికి రమ్మని చెబుతాడు. తండ్రి పాదాలు పడుతున్నాననీ ... ఆయనకి నిద్రాభంగం కలిగించలేనని అంటాడు పుండరీకుడు. ఎండ వేడిమికి తన కాళ్లు కాలుతున్నాయని అంటాడు పాండురంగడు. అయితే ఆ పక్కనే వున్నఇటుక రాయిపై నుంచోమని చెబుతాడు పుండరీకుడు. తండ్రి సేవలో ఆయన తరిస్తోన్న తీరు చూసిన పాండురంగడు, ఆయనని అనుగ్రహించడం కోసం ... అశేష భక్తజన వాహినిని తరింపజేయడం కోసం అక్కడే శిలగా మారిపోతాడు.