మహిమగల వేంకటేశ్వరుడి క్షేత్రం

సాధారణంగా వేంకటేశ్వరస్వామి శ్రీదేవి - భూదేవి సమేతంగా పూజాభిషేకాలు అందుకుంటూ దర్శనమిస్తూ వుంటాడు. కొన్ని క్షేత్రాల్లో స్వామివారు ఒక్కరే గర్భాలయంలో వుండగా, అమ్మవార్లు ప్రత్యేక మందిరాలలో కొలువై వుంటారు. మరికొన్ని క్షేత్రాల్లో స్వామివారితో పాటే అమ్మవార్లు కూడా గర్భాలయంలో వుంటారు. చాలావరకూ స్వామివారు ... అమ్మవార్లు స్థానక భంగిమలో .. అంటే నుంచుని దర్శనమిస్తూ వుంటారు.

ఇక వేంకటేశ్వరస్వామి అమ్మవార్లతో కలిసి గరుడవాహన ధారియై ఆవిర్భవించిన క్షేత్రాలు బహు అరుదనే చెప్పాలి. అలాంటి అరుదైన క్షేత్రంగా మనకి ' తమ్మర బండపాలెం' అనే గ్రామం కనిపిస్తూ వుంటుంది. నల్గొండ జిల్లా కోదాడ మండలంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. ఈ క్షేత్రంలో వేంకటేశ్వరస్వామి శ్రీదేవి - భూదేవి సమేతంగా గరుడ వాహనంపై దర్శనమిస్తూ వుంటాడు. మహర్షుల తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైనట్టుగా అనిపిస్తుంటాడు.

ప్రాచీనమైన ఈ క్షేత్రానికి సంబంధించిన సమాచారం 11 వ శతాబ్దం నుంచి మాత్రమే లభిస్తోంది. సువిశాలంగా పరచుకున్న బండపై స్వామివారు ఆవిర్భవించడం జరిగింది. పై నుంచి చూస్తే ఈ బండ తామరపువ్వు ఆకారంలో కనిపిస్తుంది. అందువలన అప్పట్లో దీనిని అంతా 'తామరబండ' అని పిలుచుకునే వారు. అలా కనిపించే ఈ బండ మధ్యభాగంలో స్వామివారు ఆవిర్భవించడం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకతగా చెబుతుంటారు.

తామరబండ అనేది క్రమంగా ఊరుపేరుగా మారిపోయింది. ఇప్పుడు ఈ బండకి సమీపంగా వున్న రెండు ఊర్లను కలుపుకుని 'తమ్మరబండపాలెం'గా పిలుస్తుంటారు. 17 వ శతాబ్దంలో స్వామివారికి ఆదరణ కరువైపోవడంతో, స్వామివారు 'చందూలాల్ బహదూర్ షా' అనే నవాబుకి స్వప్నంలో కనిపించి, తన నిత్యారాధనకి తగిన ఏర్పాట్లు చేయమని ఆదేశించాడట. మరునాడు ఉదయాన్నే ఆయన తన మనుషులను పంపించి, అందుకు తగిన ఏర్పాట్లను చేయించాడట.

ఈ క్షేత్రంలో 'గోకర్ణం' అనే పేరుతో 'కోనేరు' కనిపిస్తుంది. ఎంతటి కరవు కాటకాలు వచ్చినా ఇందులోని నీరు లేకుండా పోవడం ఇంతవరకూ జరగలేదని చెబుతుంటారు. ఆలయ ప్రాంగణంలో 30 అడుగుల ఎత్తున దీప స్తంభం కనిపిస్తుంది. పూర్వం ఈ స్తంభంపై దీపం వెలిగించాక దానిని దర్శించుకుని ఊళ్లోని గ్రామస్తులు తమ ఇళ్లలో దీపాలు వెలిగించేవారట. 17 వ శతాబ్దం నుంచి 'ముడుంబై' వంశీకులైన అర్చకులు ద్రవిడ సంప్రదాయం ప్రకారం ఇక్కడ పూజాభిషేకాలు జరుపుతున్నారు.

ప్రతి నెలా శ్రవణా నక్షత్రం రోజున మాస కల్యాణోత్సవం ... ఫాల్గుణ పౌర్ణమి రోజున వార్షిక కల్యాణోత్సవం నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక్కడి స్వామి మహిమాన్వితుడనీ ... కోరిన వరాలను ప్రసాదిస్తాడని విశ్వసుస్తుంటారు.


More Bhakti News