ప్రదక్షిణలతో అనుగ్రహించే స్వామి

సుబ్రహ్మణ్యస్వామి ఆవిర్భవించిన విశిష్టమైన క్షేత్రాల్లో 'మల్లాం' ఒకటిగా కనిపిస్తూ వుంటుంది. నెల్లూరు జిల్లాలోని సుప్రసిద్ధమైన ఆలయాలలో మల్లాం ముందు వరుసలో కన్పిస్తుంది. వల్లీ దేవసేన సమేతంగా ఇక్కడ సుబ్రహ్మణ్యస్వామి దర్శనమిస్తూ వుంటాడు. అనేక విశేషాలకు నెలవుగా ఈ క్షేత్రం అలరారుతోంది. ప్రాచీన వైభవానికీ ... ఆధ్యాత్మిక సంపదకు ఆనవాలుగా వెలుగొందుతోంది.

స్వామి ఆవిర్భావం నుంచి మొదలుకుని ఈ క్షేత్రంలో ప్రతిదీ ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తూ వుంటుంది. అలాంటి ప్రత్యేకతలలో ఒకటిగా ఇక్కడ 'ప్రదక్షిణలు' కనిపిస్తూ వుంటాయి. సాధారణంగా ఏ క్షేత్రానికి వెళ్లినా ప్రదక్షిణలు చేయడం జరుగుతూ వుంటుంది. తమ మనసులోని మాటను భగవంతుడికి చెప్పుకుంటూ భక్తులు ప్రదక్షిణలు చేస్తుంటారు. అయితే అలా ప్రదక్షిణ చేయడం వలన తప్పకుండా ఫలితాన్నిచ్చే క్షేత్రాల్లో ఒకటిగా మల్లాం దర్శనమిస్తుంది.

సుబ్రహ్మణ్య స్వామి అనగానే సర్ప సంబంధమైన దోషాలను తొలగిస్తాడనీ, సంతాన భాగ్యాన్ని కలిగిస్తాడని విశ్వసిస్తూ వుంటారు. ఇక ఇక్కడి సుబ్రహ్మణ్యస్వామి విషయానికి వచ్చేసరికి, కుజ సంబంధమైన దోషాలను తొలగించడమే కాకుండా, ప్రదక్షిణలు చేసినవారి అనారోగ్యాలను నివారిస్తాడని చెబుతుంటారు. ఈ కారణంగా ఈ స్వామివారికి ప్రదక్షిణలు చేసే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధలు పడుతున్నవారు ఇక్కడి స్వామివారిపై పూర్తి విశ్వాసముంచి ప్రదక్షిణలు చేయడం వలన ఆశించిన ఫలితం కనిపిస్తుందని అంటారు.


More Bhakti News