వరాలను కురిపించే వరలక్ష్మి

శ్రావణమాసంలో అత్యంత ముఖ్యమైన వ్రతంగా 'వరలక్ష్మీవ్రతం' చెప్పబడుతోంది. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తూ వుంటారు. ఈ వ్రతం ఎంత విశేషమైనదంటే, సాక్షాత్తు సర్వమంగళ అయిన పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించినట్టు పురాణాలు చెబుతున్నాయి.

అంతటి విశిష్టత కలిగిన ఈ రోజున పుణ్యస్త్రీలు సూర్యోదయానికి ముందే మంగళస్నానాలు చేసి ... కొత్త వస్త్రాలను ధరించి ... కలశాన్ని పెట్టుకుని ... కొబ్బరికాయనే అమ్మవారిగా అలంకరించి ఆవాహన చేస్తుంటారు. ముందుగా గణపతిని ఆరాధించి ఆ తరువాత వరలక్ష్మిని పూజిస్తుంటారు. తోరాన్ని కట్టుకుని ముత్తయిదువులకు వాయనాలు ఇస్తుంటారు. అయితే ఈ వ్రతం ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలంటే నియమాలు పాటించడంతో పాటు, ఆ తల్లి పట్ల ఎంతో ప్రేమానురాగాలను కలిగి వుండాలి.

వ్రతానికి సంబంధించిన ప్రతి పనిని అమ్మవారిపై గల ప్రేమతో ఇష్టంగా చేయాలి. అమ్మవారికి నచ్చేలా ఇల్లంతా కళకళలాడుతూ పవిత్రతను ప్రతిబింబిస్తూ వుండాలి. అప్పుడు అమ్మవారు తప్పనిసరిగా వస్తుంది ... ఎదురుగా వున్నది ప్రతిమ కాదు ... సాక్షాత్తు అమ్మవారేనని బలంగా విశ్వసిస్తూ వుండాలి. వ్రతం చేస్తున్నప్పుడు ... వ్రతానికి వచ్చినప్పుడు దృష్టి పీఠంపై నిలిపి ... మనసులో అమ్మవారిని ధ్యానిస్తూ వుండాలి ... వ్రత కథను శ్రద్ధగా ఆలకించాలి.

వ్రతం చేసుకునేవారు ఈ రోజున ఏ విషయంగా గానీ ఒకరిపై ఒకరు చిరాకుపడటం ... అలగడం ... వ్రతం జరుగుతుంటే అక్కడికి రాకపోవడం వంటివి చేయకూడదు. అమ్మవారు ఇష్టపడే ప్రశాంతత ఉండేలా చూసుకోవాలి. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉన్నప్పుడే అమ్మవారు వస్తుందని మరిచిపోకూడదు. వీలైతే కొత్తగా కొన్న నగలతో అమ్మవారిని అలంకరించాలి ... ఆమెకి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటో తెలుసుకుని అవే చేయాలి. ముత్తయిదువులను సాక్షాత్తు అమ్మవారు రూపాలుగానే భావిస్తూ అందరినీ సమానంగా చూడాలి.

సంతోషం ... సంతృప్తి ... సఖ్యత ... పవిత్రత ... ప్రశాంతత ... ప్రేమాభిమానాలు ... అసమానమైన భక్తి విశ్వాసాలతో వ్రతకథలో గల 'చారుమతి' అమ్మవారి మనసు గెలుచుకుంది. ఆమెని దృష్టిలో పెట్టుకోవడం వలన మరింత అంకితభావం పెరుగుతుంది. అప్పుడు చల్లని మనసున్న అమ్మవారు వరాలను కురిపించే వరలక్ష్మిగా తప్పకుండా అనుగ్రహిస్తుంది. సౌభాగ్యం ... సంతానంతో కూడినటువంటి సిరిసంపదలను ప్రసాదిస్తుంది.


More Bhakti News