అంతా అమ్మవారి అనుగ్రహమే !
భోజమహారాజుకి కాళిదాసు ఘనతను గురించి తెలుస్తుంది. కాళిదాసు పాండిత్యాన్ని ప్రత్యక్షంగా చూడాలని అనుకుంటాడు. అంతకుముందుగా ఆయనని తన ఆస్థానానికి పిలిపించి సత్కరించాలని అనుకుంటాడు. ప్రస్తుతం తన రాజ్యంలోనే ఆయన ఉన్నాడని తెలుసుకుని, ఆయనను సగౌరవంగా తీసుకురమ్మని ఆస్థాన విద్వాంసుడితో పాటు రాజప్రతినిధిని పంపిస్తాడు.
కాళిదాసు వస్తే తన పదవి పోతుందని భావించిన ఆస్థాన విద్వాంసుడు, ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోడు. కాళిదాసు కనిపించినా ఆయనని ఆహ్వానించడం పట్ల ఆసక్తి చూపడు. తాము వచ్చిన పని గురించి రాజప్రతినిధి కాళిదాసుతో చెబుతాడు. తాను అమ్మవారి అనుగ్రహాన్నే తప్ప, సత్కారాలను కోరుకోవడం లేదంటూ వాళ్ల అభ్యర్థనను కాళిదాసు సున్నితంగా తిరస్కరిస్తాడు. తాను ఓ ముఖ్యమైన పనిపై వెళుతున్నానంటూ అక్కడి నుంచి బయలుదేరుతాడు.
విషయాన్ని తెలుసుకున్న భోజరాజు తీవ్రమైన అసహనానికి లోనవుతాడు. సన్మాన సత్కారాలను కాళిదాసు తిరస్కరించడంతో ఆయన వ్యక్తిత్వం భోజరాజుకి అర్థమవుతుంది. అంతటి గొప్ప పండితుడిని తాను తప్పకుండా కలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ రాత్రి మారువేషాన్ని ధరించి .. తన పరివారాన్ని కూడా అలాగే తనతో రమ్మని చెప్పి బయలుదేరుతాడు.
కొంత దూరం ప్రయాణం చేశాక ... కాళిదాసు భోజరాజు కంటపడతాడు. భోజరాజు ఎంతో ఆనందిస్తూ ఆయనని తన ఆస్థానానికి ఆహ్వానిస్తాడు. తన కోసం భోజరాజే స్వయంగా రావడం కాళిదాసుకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కవిత్వం పట్ల ఆయనకి గల అభిమానం ఎంతటిదో అర్థంకావడంతో అంగీకరిస్తాడు. కాళిదాసు ఒప్పుకోవడం అమ్మవారి అనుగ్రహంగా భోజరాజు భావిస్తాడు. భోజరాజు ఆహ్వానం ... అమ్మవారి ఆదేశంగా భావించి ఆయన వెంట బయలుదేరుతాడు కాళిదాసు.