అంకాళమ్మ అలా నిప్పుతెచ్చి ఇచ్చేదట !

కొన్ని వందల సంవత్సరాల క్రితం అది ఒక అడవి ... ఆ అడవిమీదుగా గల కాలిబాట ద్వారా అక్కడికి దగ్గరలో గల ప్రజలు ఆయా పనులమీద వెళుతూ వస్తూ వుండేవాళ్లు. ఎక్కువగా ఆయా జంతువుల కోసం వేటగాళ్లు తిరుగుతూ వుండేవాళ్లు. బాటసారులు తమ వెంట తెచ్చుకున్న పదార్థాలను వండుకుందమన్నా, వేటగాళ్లు ఆకలేసి తాము వేటాడిన జంతువుల మాంసాన్ని కాలుద్దామన్నా అక్కడ నిప్పు దొరకదు.

అలాంటి పరిస్థితుల్లో వాళ్లు అయ్యో నిప్పు దొరికితే బాగుండేదని అనుకోగానే, ఒక వృద్ధురాలు నిప్పు తీసుకుని వచ్చి ఇచ్చి వెళుతూ ఉండేదట. ఎవరికి వారు తమ పని పూర్తికాగానే తిరిగి అక్కడి నుంచి బయకుదేరి వెళ్లిపోయే వాళ్లు. ఇలా చాలామందికి అవసరాల్లో ఆ వృద్ధురాలు నిప్పుతెచ్చి ఇస్తూ ఉండటంతో, ఈ అనుభవం గురించిన చర్చలు మొదలయ్యాయి.

అంత దట్టమైన అడవిలో ... ఎవరూ నివసించని ప్రదేశంలో ఆమె ఎక్కడి నుంచి వస్తోంది ? ... ఎలా నిప్పు తెస్తోంది ? అనే సందేహం మొదలైంది. కొంతమంది ఈ విషయం తెలుసుకోవడానికి ఆసక్తి చూపారు. అనుకున్నట్టుగానే అడవికి వెళ్లి ... నిప్పు లేదే అని అనుకున్నారు. ఆ వృద్ధురాలు వచ్చి ... వాళ్లకి నిప్పు ఇచ్చి వెనుదిరిగింది. వాళ్లు ఆమెని రహస్యంగా అనుసరించారు. ఆ వృద్ధురాలు .... ఒక దేవతామూర్తి ప్రతిమ దగ్గరికి వెళ్లి అందులో లీనమైపోయింది.

అప్పుడు అర్థమైంది వాళ్లకి ... ఆకలి తీర్చడానికి అవసరమైన నిప్పును అందించే ఆ వృద్ధురాలు ... 'అంకాళమ్మ' అని. అమ్మవారు కూడా అలా వెలుగు చూడాలని అనుకోవడం వల్లనే వారికి కనిపించింది. ఈ విషయం పరిసర గ్రామస్తులకు తెలవడంతో, జనం పెద్దసంఖ్యలో వచ్చి ఆ తల్లి దర్శనం చేసుకున్నారు. ప్రాచీనకాలంలో మహర్షులు అమ్మవారిని ఆరాధించారని వాళ్లు గ్రహించారు. ఆ తల్లిని తమ గ్రామదేవతగా భావించి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు.

మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోన్న ఈ అమ్మవారి ఆలయం, నల్గొండ జిల్లా 'వాడపల్లి'లో దర్శనమిస్తూ వుంటుంది. 70 - 80 సంవత్సరాల క్రితం వరకూ కూడా అమ్మవారు నిప్పు తెచ్చి ఇచ్చిన సంఘటనలు జరిగాయట. ఆ తరువాత ఇతరులకు ఆమెను చూపిస్తామని చెప్పి తీసుకువచ్చి, అవసరం లేకపోయినా పిలిచిన ఆకతాయిల వలన అమ్మవారు రావడం లేదని చెబుతుంటారు.

కానీ నిజమైన భక్తులు అవసరాల్లో వున్నా ... ఆపదల్లో వున్నా ఆ తల్లి అదృశ్య రూపంలో వాళ్లని ఆదుకుంటోందని అనుభవపూర్వకంగా చెప్పే వాళ్లున్నారు. మహిమగల ఈ తల్లిని దర్శించడం వలన ఆపదలు తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.


More Bhakti News