ఆదుకునే అయ్యప్పస్వామి
అయ్యప్పస్వామి ఆవిర్భవించిన మహిమాన్వితమైన క్షేత్రాల్లో ఒకటిగా 'కుళత్తుపుళా' దర్శనమిస్తూ వుంటుంది. కేరళ - తిరువనంతపురానికి సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. కేరళలోని విశిష్టమైన అయ్యప్పస్వామి ఆలయాలలో ఇది ఒకటిగా చెప్పబడుతోంది. బాలకుడిగా వెలసిన అయ్యప్పస్వామి ఈ క్షేత్రంలో పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. అదే సమయంలో గర్భాలయంలో గల కొన్ని రాళ్లను కూడా ఈ పూజలో వుంచుతుంటారు.
ఈ రాతి భాగాలన్నీ కూడా ఒకే శిల నుంచి వచ్చినవే. ప్రస్తుతం శిలా భాగాలుగా కనిపిస్తోన్న ఈ రాళ్లు గర్భాలయంలోకి చేరడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ వుందని చెబుతుంటారు. పూర్వం అడవీ ప్రాంతంలో వున్న ఈ శిల ఒక రాజు కారణంగా భిన్నమైపోయింది. పగిలిపోయిన తరువాత అది అయ్యప్పస్వామి విగ్రహమనే విషయం ఆయనకి తెలుస్తుంది. జరిగిన పొరపాటుకి ఆ రాజు ఎంతగానో చింతిస్తాడు.
చేసిన పాపానికి పరిహారం చేసుకోవడం కోసం ఆయన ఇక్కడ ఆలయాన్ని నిర్మిస్తాడు. తన కారణంగా పగిలిపోయిన స్వామివారి విగ్రహం యొక్క భాగాలను ఈ ఆలయానికి చేరుస్తాడు. ఆ రోజు నుంచి ఇక్కడ వెలసిన అయ్యప్పను పూజించే సమయంలో ఈ శిలా భాగాలను కూడా పూజలో వుంచుతుంటారు. అలా ఈ ఆలయం వెనుక ఒక మహిమాన్వితమైన సంఘటన దాగివుంది. ఇక్కడి స్వామిని దర్శించడం వలన అభయాన్ని అందిస్తాడనీ, ఆపదల నుంచి గట్తెక్కిస్తాడని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.