భక్తులు అపురూపంగా భావించే విభూతి

విభూతి ధారణ గురించీ ... విభూతి ధరించడం వలన కలిగే ఫలితాలను గురించి ఆధ్యాత్మిక గ్రంధాలు ఆవిష్కరిస్తూ వుంటాయి. అలాంటి విభూతిని అందుకోవడానికి భక్తులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చే ఆలయం ఒకటుంది. అదే ... శ్వేతార్కమూల గణపతి ఆలయం. ఇది వరంగల్ జిల్లా ఖాజీపేటలో అలరారుతోంది.

గణపతి ఆకృతిని సంతరించుకున్న 'తెల్లజిల్లేడు చెట్టు మూలం'ను శ్వేతార్కమూల గణపతిగా పిలుస్తుంటారు ... కొలుస్తుంటారు. సాధారణంగానే గణపతిని పూజించడం వలన విఘ్నాలు తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుంది. ఇక శ్వేతార్కమూల గణపతి విషయానికి వచ్చేసరికి ఈయన మరింత మహిమాన్వితుడుగా చెప్పబడుతున్నాడు.

శ్వేతార్కమూల గణపతిని పూజించడం వలన విఘ్నాలు తొలగిపోవడమే కాదు, అనేక రకాల దోషాలు నశిస్తాయని ప్రాచీన గ్రంధాలు చెబుతున్నాయి. ఇంతటి విశిష్టత కలిగిన ఈ స్వామి సన్నిధిలోనే అనునిత్యం హోమం జరుగుతూ వుంటుంది. ఈ హోమంలోని విభూతిని ప్రతి మంగళవారం సాయంత్రం కొంచెం కొంచెంగా భక్తులకు ఇస్తుంటారు.

ఈ విభూతిని భక్తులు అపురూపంగా భావిస్తారు. అందువలన దీనిని అందుకునేవారి సంఖ్య అధికంగానే వుంటుంది. ఈ విభూతిని ఇంట్లోని పూజా మందిరంలో వుంచి, అనునిత్యం ధరించడం వలన అన్నిరకాల విఘ్నాలు ... సమస్త దోషాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని విశ్వసిస్తుంటారు.


More Bhakti News