స్వామి సర్ప రూపంలో తిరుగుతాడట !

పుణ్యక్షేత్రాలను దర్శిస్తున్నప్పుడు అక్కడ గల స్వామి లీలలు సహజంగానే చెవిన పడుతుంటాయి. ఆసక్తికరంగా అనిపించే ఆ సంఘటనలను గురించి తెలుసుకోవాలనీ ... తమకి కూడా అనుభవంలోకి వస్తే బాగుండునని భక్తులు అనుకుంటూ వుంటారు. ఇలాంటి మహిమలు వినడం వలన అక్కడి స్వామి ప్రత్యక్షంగా కొలువై వున్నాడనే విశ్వాసం భక్తులకు కలుగుతుంటుంది.

అలా భక్తుల నమ్మకాన్ని సంపాదించుకుని, వాళ్లచేత నిత్యనీరాజనాలు అందుకుంటోన్న స్వామిగా కుమారస్వామి దర్శనమిస్తూ వుంటాడు. ఆయన కొలువుదీరిన మహిమాన్వితమైన ఆలయాల్లో ఒకటి తమిళనాడు ప్రాంతంలోని రత్నగిరిలో కనిపిస్తూ వుంటుంది. ఇక్కడ స్వామివారు వల్లీ దేవసేన సమేతంగా దర్శనమిస్తూ వుంటాడు. అయితే కొంతమంది భక్తులకు మాత్రం ఇక్కడి స్వామివారు సర్పరూపంలో కనిపించి వెంటనే అదృశ్యమవుతూ ఉంటాడని చెబుతుంటారు. మంచి తేజస్సును కలిగివున్న ఒక సర్పం అప్పుడప్పుడు ఆలయ పరిసరాల్లో ఎక్కడో ఒక చోట కనిపించి వెంటనే మాయమైపోతూ ఉంటుందట.

ఇలా ఈ సర్పం కనిపించిన వాళ్లు ... భగవంతుడి అనుగ్రహం ప్రత్యక్షంగా లభించినట్టు భావిస్తుంటారు. అలా సర్ప దర్శనమైన వారి కోరికలు అనతికాలంలోనే నెరవేరుతూ వుండటం ఇక్కడి విశేషంగా చెబుతారు. సువిశాలమైన ప్రాంగణంలో అలరారుతోన్న మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని దర్శించడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు


More Bhakti News