భగవంతుడు ఇచ్చిన ప్రసాదం !

నవద్వీప దేశంలో లక్ష్మణసేన మహారాజు ఏర్పాటుచేసిన వసతి గృహంలో జయదేవుడు భార్యతో కలిసి ఉండసాగాడు. ప్రతి నిత్యం రాజుగారు తన సభా మందిరానికి సంబంధించిన పనులు ముగించుకుని జయదేవుడి గృహానికి వచ్చేవాడు. ఆయన రాస్తోన్న 'గీతాగోవిందం' కావ్యాన్ని గురించి అడిగి తెలుసుకుంటూ ఉండేవాడు. అలా ఏ రోజుకారోజు జయదేవుడు రాసినది వింటూ ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉండేవాడు.

అలా ఒక రోజున ఆయన జయదేవుడి గృహానికి వచ్చేసరికి, జయదేవుడి దంపతులు ఎంతో ఆనందంగా కనిపిస్తారు. విషయమేమిటని రాజుగారు కుతూహలంగా అడుగుతాడు. శ్రీకృష్ణుడు తమ ఇంటికి వచ్చి వెళ్లాడని వాళ్లు చెప్పడంతో ఆయన ఆశ్చర్యానందాలకి లోనవుతాడు. గీతాగోవిందం కావ్యంలో ఒకానొకచోట చిన్న సంశయం తలెత్తడంతో, ఆలోచిస్తూ తాను అలా బయటికి వెళ్లినప్పుడు, తన రూపంలో శ్రీకృష్ణుడు వచ్చివెళ్లాడని జయదేవుడు చెబుతాడు.

అలా వచ్చిన కృష్ణుడు కావ్యంలో ఆ పంక్తులను రాసి తన సంశయాన్నినివృత్తి చేయడమే కాకుండా, భోజనం కూడా చేసివెళ్ళాడని చెబుతూ విస్తట్లో మిగిలిపోయిన అన్నాన్ని చూపుతాడు. అది భగవంతుడు తమ కోసం వదిలిన ప్రసాదమని చెప్పి రాజుగారికి పెడతాడు. లక్ష్మణసేన మహారాజు ఆనందానికి హద్దులు లేకుండా పోతుంది. తన జీవితంలో ఆ రోజుకి మించిన పర్వదినం లేదని మురిసిపోతాడు.

జయదేవుడి కారణంగానే శ్రీకృష్ణుడు తన రాజ్యంలో ... తన సౌధంలోకి అడుగుపెట్టాడనీ, సాక్షాత్తు భగవంతుడు ఎంగిలి చేసిన ప్రసాదం లభించిందని ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాడు. భగవంతుడినే రప్పించిన ఆ కావ్య రచన తమ రాజ్యంలో కొనసాగడం తాను చేసుకున్న అదృష్టమనీ, అందుకు కారకుడు జయదేవుడేనంటూ ఆయనకి వినయపూర్వకంగా నమస్కరిస్తాడు.


More Bhakti News