ఇక్కడి కృష్ణయ్యను సేవిస్తే చాలు !

శ్రీకృష్ణుడు కొలువైనటువంటి విశిష్టమైన క్షేత్రాల్లో ఒకటిగా 'వల్లభి' కనిపిస్తూ వుంటుంది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పరిధిలో ఈ క్షేత్రం దర్శనమిస్తూ వుంటుంది. వేణు గోపాలుడు ఆవిర్భవించిన మహిమాన్వితమైన క్షేత్రాల్లో ఇది ఒకటిగా చెబుతారు. ఆయన లీలల్లోని ఓ భాగంగానే స్వామివారు ఇక్కడ ఆవిర్భవించడం జరిగిందని అంటారు.

చాలాకాలం క్రిందట ఈ ప్రాంతానికి చెందిన ఓ భక్తుడికి స్వామివారు కలలో కనిపించాడట. తాను ఫలానా ప్రదేశంలో భూగర్భంలో ఉన్నాననీ ... తనని వెలికి తీసి ప్రతిష్ఠించమని స్వామివారు ఆ భక్తుడిని ఆదేశిస్తాడు. మరునాడు ఉదయం ఆ భక్తుడు తనకి వచ్చిన కలను గురించి గ్రామస్తులకు చెబుతాడు. అంతా కలిసి స్వప్నంలో కృష్ణుడు చెప్పిన ప్రదేశానికి వెళతారు.

అక్కడ తవ్వి చూడగా, నిజంగానే ఆ ప్రదేశంలో నుంచి రుక్మిణీ - సత్యభామ సమేత వేణుగోపాలుడు వెలుగు చూశాడు. తమని చల్లగా చూడటం కోసం కృష్ణుడు అమ్మవార్లతో సహా వచ్చాడని ఆ గ్రామస్తులు ఆనందంతో పొంగిపోతారు. కొబ్బరికాయలు కొట్టి ... హారతులు పట్టి, ప్రస్తుతం స్వామివారు దర్శనమిస్తోన్న చోటున ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠించారు. ఆ రోజు నుంచి ఇక్కడి స్వామివారిని తమ ఇలవేల్పుగా భావించి పూజిస్తున్నారు.

స్వయంభువుగా ఆవిర్భవించిన ఇక్కడి కృష్ణుడు మహిమాన్వితుడనీ, అందుకు నిదర్శనాలు ఎన్నో వున్నాయని భక్తులు చెబుతుంటారు. ప్రతి యేటా మాఘపౌర్ణమి రోజున స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా మూడురోజుల పాటు జరిగే జాతరకి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. ఈ సమయంలోనే సంతానం లేని యువతులు 'గరుడ ముద్ద' అందుకుంటూ వుంటారు. ఇలా గరుడముద్ద అందుకున్నవారికి అనతికాలంలోనే సంతానం కలుగుతుందని చెబుతుంటారు. ఇక స్వామివారికి జరిపే గరుడ సేవలో పాల్గొనడం వలన, సకల శుభాలు కలుగుతాయని అంటారు.


More Bhakti News